Constable Chandrasekhar – Anantapur: ఒక పోలీస్ కానిస్టేబుల్ కూర్చున్న కుర్చీలోనే హఠాన్మరణం చెందారు. అనంతపురం నగరంలో ఒక బార్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం సిద్ధార్థ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు కానిస్టేబుల్ చంద్రశేఖర్. ఆ సమయంలో బార్ లో ఒకరిద్దరు పనివాళ్లు తప్ప ఎవరూ లేరు. అయితే, చంద్రశేఖర్ ఉన్నఫళంగా తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చన్న వెంటనే ఆయన ప్రాణాలొదిలి విగతజీవిగా మారిపోయారు.
బార్‌లో పనిచేసే వర్కర్లు కానిస్టేబుల్ కుర్చీలో పడి ఉండడాన్ని గమనించి లేపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కానిస్టేబుల్ లేవకపోవడంతో హుటాహుటీన యాజమాన్యానికి సమాచారం అందించారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ మృతికి గుండెపోటు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
మృతుడు చంద్రశేఖర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ది సహజమైన మృతిగానే తేల్చారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. బార్‌లో కానిస్టేబుల్ కదలికలు, మృతి చెందిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
గోవా బీచ్‌లో అర్ధనగ్నంగా మహిళ మృతదేహం.. హత్యేనంటున్న కుటుంబీకులు, మహిళా సంఘాలు
గోవా బీచ్‌లో యువతి మృతదేహం కలకలం రేపుతోంది. గోవాలోని ప్రసిద్ధ కలంగుటె బీచ్‌లో ఈ నెల 12న అర్ధనగ్నంగా యువతి మృతదేహం లభ్యమయ్యింది. సముద్రనీటిలో మునిగి ఆమె మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు ఆమె సముద్రనీటిలో పడి చనిపోయి ఉండొచ్చు లేదా సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న కారణం చెబుతున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆమెపై లైంగిక దాడి లేదా భౌతిక దాడి జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఆ యువతి మరణంపై ఆమె కుటుంబీకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఎవరో సముద్రనీటిలో తోసి హతమార్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. వారికి గ్రామస్థులు, మహిళా సంఘాలు, రాజకీయ కార్యకర్తలు బాసటగా నిలిచారు. గోవాలో సోమవారం రాత్రి వారు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆ యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువతిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని చెబుతున్న పోలీసులు.. మృతదేహం అర్ధనగ్నంగా ఎందుకు ఉందో చెప్పాలని కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.