ధర్మవరంలో నిన్నటి వరకు పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మద్య టికెట్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ తరఫున వరదాపురం సూరి మధ్య టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ధర్మవరంలో ఓవైపు పరిటాల శ్రీరామ్.. మరోవైపు వరదాపురం సూరి టికెట్ కోసం పోటీ పడుతుంటే, మధ్యలో జనసేన కూడా ధర్మవరం టికెట్ ఈసారి తమకే ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చింది. ధర్మవరం జనసేన ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ధర్మవరం టికెట్ జనసేనకు కేటాయించాలని నియోజకవర్గంలో విస్తృతంగా ర్యాలీలు, ప్రదర్శనలు కూడా చేశారు.
ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ధర్మవరం దాదాపు బీజేపీకి ఖరారు అయినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ బీజేపీకే ధర్మవరం టికెట్ ఇవ్వాల్సి వస్తే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అభ్యర్థిగా ఖరారు అయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ధర్మవరం బీజేపీ అభ్యర్థి రేసులో సత్యకుమార్ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో నిన్నటి వరకు ధర్మవరం బీజేపీ టికెట్ తనకే వస్తుంది అనుకున్న వరదాపురం సూరి కంగుతున్నారట.
స్థానికంగా టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, బీజేపీ నుంచి వరదాపురం సూరి, జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డిలను కాదని, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధర్మవరం రేసులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం ధర్మవరం బరిలో సత్యకుమార్ పేరును పరిశీలిస్తోందట. కానీ ధర్మవరం టికెట్ సత్యకుమార్ కు అంత ఈజీగా దొరకదనుకుంటున్నారు మూడు పార్టీల శ్రేణులు. స్థానికంగా ఉన్న ఈ ముగ్గురు నాయకులు తమలో ఎవరికో.. ఒకరికి టికెట్ రావాలనే కోరుకుంటారు. కానీ స్థానికేతరుడు అయిన సత్యకుమార్ అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమంటున్నారట. కాకపోతే కొంతలో కొంత ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాత్రం సత్యకుమార్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవచ్చని తెలుస్తోంది.
ర్మవరం టికెట్ విషయంలో పరిటాల శ్రీరామ్‌కు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన గోనుగుంట్ల సూర్యనారాయణకు టికెట్ రాకుండా సత్యకుమార్ కు టికెట్ వస్తే, రాజకీయంగా వరదాపురం సూరిపై పరిటాల శ్రీరామ్ పై చేయి సాధించినట్లే అంటున్నారు పార్టీ శ్రేణులు. ఈ సమీకరణలో ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ఖరారు అయితే పరిటాల శ్రీరామ్ కచ్చితంగా సహకరిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కానీ ధర్మవరంలో అర్థ బలం, అంగ బలం దండిగా ఉన్న వరదాపురం సూరి అంత ఈజీగా టికెట్ ను వదులుకోరట.
ఎప్పుడైతే ధర్మవరం బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ పేరు తెరమీదకు వచ్చిందో.. వరదాపురం సూరి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారట. నిన్నటి వరకు ధర్మవరం అభ్యర్థిని నేనే.. ఎమ్మెల్యేగా గెలిచేది నేనే అని చెప్పుకుంటున్న వరదాపురం సూరి.. అసలు టిక్కెట్ రాకపోతే రాజకీయంగా తన ఉనికి ప్రశ్నార్థకమవుతుందని.. అదేవిధంగా ప్రత్యర్థులు దగ్గర చులకన భావన ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వరదాపురం సూరి ఎట్టి పరిస్థితుల్లో ధర్మవరం టికెట్ వదులుకోవడానికి ఇష్టపడటంలేదట. ఏది ఏమైనా ధర్మవరం రాజకీయాల్లో పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి, చిలకం మధుసూదన్ రెడ్డిలు కాకుండా…అనూహ్యంగా సత్యకుమార్ పేరు తెరమీదకి రావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…