అంగన్వాడీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. తాజాగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ మీటింగులో అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనాలు పెంచాలని అంగన్వాడీ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతనాలు పెంచే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 1.64 లక్షల మందికి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని మంత్రుల కమిటీ తెలిపింది. గ్రాట్యుటీ అమలు కోసం హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని, అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరారు మంత్రి బొత్స. వేతనాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ అమలు చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీ సంఘాలు తేల్చి చెప్పాయి.
సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘మాది మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు. వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అంగన్వాడీ సంఘాలను కోరినట్లు తెలిపారు. పండగ తర్వాత మరోసారి చర్చిద్దామన్నారు. మా విజ్ఞప్తుల పట్ల అంగన్వాడీలు సానుకూలంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీల సమ్మెలతో బాలింతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇదిలా ఉంటే అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తాం. సీఎం చొరవ తీసుకుని మా డిమాండ్లు నెరవేర్చాలి. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా ఆందోళన ఉద్ధృతం చేస్తాం. జనవరి 3న జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తాం’’. అని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. దీంతో ఈ నిరసనలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..