ఏలూరు..ప్రపంచంలో అలాంటి అద్భుతమైన రంగులు మారే శివలింగం మరెక్కడా లేదు… ఆ శివలింగంలో మహిమను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. రెండు వర్ణాలలో భక్తులకు దర్శనమిస్తున్న ఏకైక శివాలయం ప్రపంచంలో ఇదొక్కటే.. అదే పంచారామ క్షేత్రాలలో ఒకటిగా పిలవబడుతున్న భీమవరంలోని సోమారామం..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ మహిమాన్విత క్షేత్రం ఉంది. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా కొలవబడుతూ నిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్న శివాలయం ఇది..సోమేశ్వరస్వామి దేవాలయంగా భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ ఉమాసోమేశ్వర జనార్ధనస్వామిగా పరమశివుడు లింగ రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత ముక్కలుగా ఖండింపబడిన శివలింగంలో ఒక ముక్క ఇక్కడ పడిందని, అందుకే దీనిని పంచారామాలలో ఒకటిగా పిలుస్తారని ఆలయ స్థల పురాణం చెబుతుంది.
ఈ ఆలయంలో శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని పురాణాలలో చెప్పబడింది. ఇక్కడ శివలింగానికి ఓ విశిష్టత ఉంది. పౌర్ణమికి ఒక వర్ణంలోనూ అమావాస్యకు మరొక వర్ణంలో ఇక్కడ శివలింగం మారుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఉండడం ప్రత్యేకం. శ్వేతవర్ణంలో ఉన్న శివలింగం అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. అదేవిధంగా పౌర్ణమి వచ్చేసరికి మరల తిరిగి శ్వేతావర్ణంలోకి మారిపోతుంది. ఈ దేవాలయంలో శివలింగం చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల వల్ల ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు శివలింగంలో ఈ మార్పులు జరుగుతాయని అర్చకులు చెబుతున్నారు.
అలాగే ఈ ఆలయం రెండు అంతస్తులలో ఉంటుంది. సోమేశ్వర స్వామి కింద అంతస్తులో వుంటుంది. గర్భాలయ పై భాగంలో రెండవ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అలాగే ఆలయం ముందర భాగాన కోనేరు ఉంది. దానిని చంద్ర పుష్కరిణిగా పిలుస్తారు. చంద్ర పుష్కరిణిలో స్నానాలు చేసిన వారి పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. అలాగే కోనేరు గట్టుపై వున్న రాతి స్తంభం పై నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే ఆలయంలో శివలింగం కనిపిస్తుంది. అలాగే దేవాలయం ముందర భాగాన ఉన్న రాతి గట్టు నుంచి చూస్తే అన్నపూర్ణాదేవి కనిపించడం ఇక్కడ విశేషం. ఆలయ ప్రాంగణంలో ఐదు నందులు ఉండడంతో దీనిని పంచ నందీశ్వరాలయం గా కూడా పిలుస్తారు.
ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఐదు రోజులు పాటు జరుపుతారు. అంతేకాక దేవి నవరాత్రులను సైతం ఈ ఆలయంలో ఎంతో ఘనంగా చేస్తారు. అలాగే కార్తీక మాసంలో ఈ ఆలయంలో కార్తీక శోభ వెల్లివెత్తుతుంది. కార్తీక మాసంలో మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లేచి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే చంద్ర పుష్కరిణిలో కార్తీకదీపం వెలిగిస్తారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా పిలవబడుతున్న క్షేత్రం కావడంతో సాధారణ రోజుల్లో సైతం భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం ఈ దేవాలయానికి భక్తులు వస్తుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..