Andhra Pradesh: సముద్ర తీర ప్రాంతంలో అంతా భయం భయం.. కంటి మీద కునుకు లేని పరిస్థితి

నిత్యం సముద్రంలోనే ఉంటూ చేపల వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులకు ఎగిసిపడే అలలు ప్రాణ సంకటంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంతంలో ముందుకు ముంచుకొస్తున్న సముద్రం ఉధృతితో తీవ్రంగా కోతకు గురవుతున్న తీర ప్రాంతమే అందుకు కారణం. సముద్రం నానాటికి ముందుకు వస్తుండటంతో రాత్రి తొమ్మిది దాటితే సముద్రం నీరు ఇళ్లల్లోకి చేరుకుంటుంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి...

Andhra Pradesh: సముద్ర తీర ప్రాంతంలో అంతా భయం భయం.. కంటి మీద కునుకు లేని పరిస్థితి
Representative Image

Edited By: Narender Vaitla

Updated on: Oct 21, 2023 | 7:16 PM

విజయనగరం జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. రోజురోజుకు ముందుకు వస్తున్న కడలి మత్స్యకారుల జీవితాల్లో కల్లోలాన్ని నింపుతుంది. రాత్రయితే చాలు గుండెల్లో కుంపటిలా మారుతుంది సముద్రపు నీరు. ఇది గంగమ్మనే నమ్ముకొని జీవిస్తున్న గంగపుత్రులకు వచ్చి పడిన పెద్ద కష్టమే అని చెప్పక తప్పని పరిస్థితి.

నిత్యం సముద్రంలోనే ఉంటూ చేపల వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులకు ఎగిసిపడే అలలు ప్రాణ సంకటంగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంతంలో ముందుకు ముంచుకొస్తున్న సముద్రం ఉధృతితో తీవ్రంగా కోతకు గురవుతున్న తీర ప్రాంతమే అందుకు కారణం. సముద్రం నానాటికి ముందుకు వస్తుండటంతో రాత్రి తొమ్మిది దాటితే సముద్రం నీరు ఇళ్లల్లోకి చేరుకుంటుంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గతంలో సముద్రం దాటికి తీర ప్రాంతంలో ఉన్న నాలుగు ఇల్లు ధ్వంసం అయ్యాయి. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా అధికారులు ఏర్పాటు చేసిన ప్రొటక్షన్ వాల్ సైతం కూలిపోయింది.

దీంతో తీరం మరింతగా కోతకు గురై ప్రమాదకరంగా మారడంతో మత్స్యకారులకు ఇప్పుడు మరింత టెన్సన్ రేపుతుంది. ప్రొటెక్షన్ వాల్ కి ఆనుకొని ఉన్న సిమెంట్ రోడ్డు సైతం దెబ్బతింది. సిమెంట్ రోడ్డు పై నుంచి నడవాలంటేనే ప్రమాదకరంగా మారింది. సిమెంట్ రోడ్డు దెబ్బతినడంతో పక్కనే ఉన్న విలువైన భవనాలు సైతం కోతకు గురై కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ధ్వంసం అయిన నాలుగు ఇళ్లకు సంబంధించిన మత్స్యకారులు బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు.

రోజురోజుకు రెచ్చిపోతున్న సముద్రం, ఎగిసిపడుతున్న అలలు, ముందుకు వస్తున్న సముద్రం నీరు అందరిని కలవరానికి గురిచేస్తుంది. గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులను గంగమ్మ తల్లే ముంచెత్తటం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్పా మత్స్యకారులకు భరోసా ఇచ్చిన పరిస్థితులు కనిపించడం లేదు. ఇల్లు కోల్పోయిన మత్స్యకారులకు అధికారులు ఎలా ఆదుకుంటారో తెలియడం లేదు. సముద్రంలో అకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న ఆటుపోట్లు మత్స్యకారుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

నిత్యం సముద్రంలో వేటకు వెళ్లి చేపల వేటతో జీవించే మత్స్యకారులే ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులతో ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. కోతకు గురైన ప్రాంతం చూస్తే భయానకంగా ఉంది. అమావాస్య, పౌర్ణమి వస్తుంది అంటే రెచ్చిపోతున్న సముద్ర ఉగ్ర రూపం ఎవరి పై ఎలా విరుచుకుపడుతుందో తెలియడం లేదు. రానున్న అమావాస్య, పౌర్ణమికి సముద్రంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయో అర్థంకాక మరింత ఆందోళనకు గురవుతున్నారు మత్స్యకారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..