AP News: పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్.. ఇకపై నెలనెలా రూ. 3 వేలు పెన్షన్..

| Edited By: Ravi Kiran

Jan 01, 2024 | 7:57 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం..

AP News: పెన్షనర్లకు సీఎం జగన్ న్యూఇయర్ గిఫ్ట్.. ఇకపై నెలనెలా రూ. 3 వేలు పెన్షన్..
Andhra CM YS Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది సర్కార్. ఎనిమిది రోజుల పాటు పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులనూ పంపిణీ చేయనుంది ప్రభుత్వం.

ఇవాళ్టి నుంచి సామాజిక పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 వరకూ టీడీపీ ప్రభుత్వంలో నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నుంచి రూ. 2250 రూపాయలకు పెన్షన్‌ను పెంపు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్లు ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను అందిస్తుంది. ఆ తర్వాత నుంచి జనవరి 2022లో 2500కి పెంపు చేసింది. 2023 జనవరి నుంచి మరో 250 పెంచి రూ. 2750 ఇచ్చింది. 2024 జనవరి నుంచి మరో 250 రూపాయలు పెంచి మొత్తం 3 వేలు చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 52.17 లక్షల మంది పెన్షనర్లు ఉంటే డిసెంబర్ వరకూ 64.45 లక్షల మంది లబ్దిదారులున్నారు. తాజాగా మరో లక్షా 17 వేల 161 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో జనవరి ఒకటి నుంచి మొత్తం 66.34 లక్షల మందికి పెన్షన్లు అందించనుంది.

ఈ నెల 8 వరకూ పెన్షన్ల పెంపు ఉత్సవాలు..

రాష్ట్రంలో వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత, మత్స్య, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుకు సామాజిక పెన్షనలను అందిస్తోంది ప్రభుత్వం. 2014-19 మధ్యకాలంలో నెలకు పెన్షన్‌ల కోసం ప్రభుత్వం రూ. 400 కోట్లు ఖర్చు పెట్టేది. జూలై 2019 నుంచి నెలకు రూ. 1384 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత జనవరి 2022 నుంచి 2500కు పెన్షన్ పెంపుతో ఏటా సగటున రూ. 1570 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. జనవరి 2023 నుంచి పెన్షన్ రూ. 2750 కావడంతో ప్రభుత్వ ఖజానాపై రూ. 1776 కోట్లు నెలకు భారం పడుతోంది. తాజాగా మూడు వేలకు పెన్షన్లు పెంచడంతో ప్రతి నెలా సగటున రూ. 1968 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవైపు పెరిగిన పెన్షన్‌లు పంపిణీతో పాటు కొత్తగా అర్హత పొందినవారికి కొత్త పెన్షన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 8 వరకూ పెన్షన్ల పంపిణీ ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ నెల 3న కాకినాడలో పెంచిన పెన్షన్లను లబ్దిదారులుకు సీఎం జగన్ చేతుల మీదుగా అందించనున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది.