Jagananna Vidya deevena: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బుధవారం జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నగదు జమచేయనున్నారు. బుధవారం ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో భాగంగా బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. సీఎం తూర్పు గోదావరి పర్యటనలో భాగంగా ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. అక్కడ సత్యవతి నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే ఉన్నత విద్య చదివుతున్న పేద పిల్లలను ఉచితంగా చదివించే ఉద్దేశంతో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అర్హులైన విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఇతర కోర్సులు చదివేవారికి రూ.20 వేలు, ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. కళాశాలలకు కట్టాల్సిన ఫీజులను 3 నెలలకొకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.
ఇదిలా ఉంటే ఫీజుల విషయంలో కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టకుండా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే నేరుగా సీఎంఓ కాలేజీలతో మాట్లాడే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..