Andhra Pradesh: రేపే రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్న సీఎం జగన్.. అత్యాధునిక‌ వ‌స‌తుల‌తో క‌ళాశాల‌ నిర్మాణం

| Edited By: Surya Kala

Sep 14, 2023 | 1:38 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సేవ‌ల మౌలిక స‌దుపాయాల అభివృద్ది సంస్థ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ నిర్మాణ కంపెనీ నాగార్జున క‌న‌ష్ట్ర‌క్ష‌న్స్ ద్వారా మూడేళ్ల‌లో ఈ క‌ళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉండ‌గా, 30 నెలల్లో ప‌నులు పూర్తి చేయ‌డానికి ఈ సంస్థ సంక‌ల్పించింది. మొత్తం 70 ఎక‌రాల సువిశాల స్థ‌లంలో దాదాపు 14ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో భ‌వ‌నాల‌ను నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు ల‌క్షా, 50వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో భ‌వ‌నాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేశారు.

Andhra Pradesh: రేపే రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్న సీఎం జగన్.. అత్యాధునిక‌ వ‌స‌తుల‌తో క‌ళాశాల‌ నిర్మాణం
Vizianagaram Medical College
Follow us on

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్. విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలను నేరుగా ప్రారంభించి అనంతరం మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాలలను వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు. అందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు అధికారులు. ప్రారంభించిన తరువాత ఐదు కళాశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతారు. అలాగే విద్యార్థుల విద్య నిమిత్తం ఏర్పాటుచేసిన స్కిల్ ల్యాబ్‌, బ‌యోకెమిస్ట్రీ ల్యాబ్‌, అనాట‌మీ మ్యూజియంలను ప‌రిశీలిస్తారు

ద‌శ‌ల‌వారీగా నిర్మాణం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాలతో జిల్లావాసుల కల నెరవేరింది. జిల్లా కేంద్రానికి అతి స‌మీపంలోని గాజుల‌రేగ వ‌ద్ద సుమారు 70 ఎక‌రాల స్థ‌లంలో ప్ర‌భుత్వ‌ వైద్య క‌ళాశాల నిర్మాణాన్ని ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఈ క‌ళాశాల‌ ప్ర‌స్తుత జిల్లా కేంద్రాసుప‌త్రికి సుమారు నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో, జాతీయ ర‌హ‌దారికి కేవలం ఐదు కిలోమీట‌రు దూరంలో ఉంది. 22.3.21న జీఓ నెంబర్ 33 ద్వారా జిల్లాకు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని నిర్మాణానికి ఐదు వందల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డంతో బాటు, 2021 మే 31న ముఖ్య‌మంత్రి జగన్ శంకుస్థాప‌న చేశారు. మొద‌టి ద‌శలో క‌ళాశాల భ‌వ‌నాన్ని నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనిలో త‌ర‌గ‌తి గ‌దుల‌ను, ముఖ్య‌మైన ల్యాబ్‌ల‌ను, హాస్ట‌ల్ భవ‌నాన్ని నేడు ముఖ్య‌మంత్రి ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రాసుప‌త్రిని సుమారు 8.6 కోట్ల వ్య‌యంతో ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిగా అన్ని వ‌స‌తుల‌తో తీర్చిదిద్ద‌డంతో పాటు విద్యార్ధులకు అనుబంధ బోధ‌నాసుప‌త్రి ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చింది. ఈ క‌ళాశాల‌కు తొలి ఏడాదికి గాను 150 వైద్య సీట్లు మంజూరు కాగా, ఇప్ప‌టికే సుమారు 114 మంది విద్యార్ధులు క‌ళాశాలలో చేరారు. మిగిలిన సీట్ల‌ భర్తీకి ప్ర‌వేశాలు జ‌రుగుతున్నాయి. దాదాపు 117 మంది విద్యార్ధుల‌కు వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించే విధంగా తాత్కాలిక‌ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని కూడా సిద్దం చేశారు.

అత్యాధునిక‌ వ‌స‌తుల‌తో క‌ళాశాల‌

కార్పోరేట్ క‌ళాశాల‌ల‌కు ధీటుగా, ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో ప్రభుత్వ వైద్య‌ క‌ళాశాల‌ను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ద‌మైన బోధ‌నా క‌ళాశాల‌ భ‌వ‌నంలో డిజిట‌ల్ క్లాస్ రూముల‌ను, ఎసి సౌక‌ర్యాల‌ను, అత్యాధునిక సౌండ్‌, లైటింగ్ సిస్ట‌మ్స్‌ను ఏర్పాటు చేశారు. ఆధునిక ప‌రిక‌రాల‌తో కూడిన బ‌యో కెమిస్ట్రీ ల్యాబ్‌, హిస్టాల‌జీ ల్యాబ్‌, స్కిల్ ల్యాబ్‌, లెక్చ‌ర్ రూమ్స్‌ను సుమారు ఆరు కోట్ల వ్య‌యంతో సిద్దం చేశారు. ఇక్క‌డ త్వ‌ర‌లో మ్యూజియంను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య సేవ‌ల మౌలిక స‌దుపాయాల అభివృద్ది సంస్థ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ప్ర‌ముఖ నిర్మాణ కంపెనీ నాగార్జున క‌న‌ష్ట్ర‌క్ష‌న్స్ ద్వారా మూడేళ్ల‌లో ఈ క‌ళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉండ‌గా, 30 నెలల్లో ప‌నులు పూర్తి చేయ‌డానికి ఈ సంస్థ సంక‌ల్పించింది. మొత్తం 70 ఎక‌రాల సువిశాల స్థ‌లంలో దాదాపు 14ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో భ‌వ‌నాల‌ను నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు ల‌క్షా, 50వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో భ‌వ‌నాల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేశారు. సుమారు 500 ప‌డ‌క‌ల‌తో ఆసుప‌త్రి భ‌వ‌నాలు, క‌ళాశాల భ‌వ‌నం, స‌ర్వీస్ బ్లాక్‌, మొద‌టి, రెండో సంవ‌త్స‌ర వైద్య‌ విద్యార్థుల‌ కోసం బాలిక‌లు, బాలురకు వేర్వేరుగా వ‌స‌తి గృహాలు, బోధ‌నా సిబ్బందికి నివాస గృహాలు, స్టాఫ్ క్వార్ట‌ర్స్‌, న‌ర్సింగ్ క‌ళాశాల‌, న‌ర్సుల క్వార్ట‌ర్స్‌, ట్రైనీ న‌ర్సుల కోసం బాల‌, బాలిక‌ల‌కు వేర్వేరుగా వ‌స‌తిగృహాలు, మార్చురీ, బ‌యోమెడిక‌ల్ వేస్టేజ్ బ్లాక్‌, సెక్యూరిటీ బ్లాక్‌, గెస్ట్ హౌస్‌, ప్ర‌జ‌లు వేచి ఉండేందుకు గానూ ధ‌ర్మ‌శాల‌, అంబులెన్సు షెడ్‌, డ్ర‌గ్ స్టోర్‌, కిచెన్ క‌మ్ డైనింగ్ షెడ్‌, మెడిక‌ల్‌ ఆక్సీజ‌న్ ప్లాంట్ మొద‌ల‌గు నిర్మాణాల‌ను ద‌శ‌ల‌ వారీగా పూర్తి చేయ‌నున్నారు.

ఇవి కూడా చదవండి

అందుబాటులో ఆధునిక‌ వైద్య సేవ‌లు

జిల్లాలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ఏర్పాటు చేయ‌డం ద్వారా, ఆధునిక వైద్య సేవ‌లు జిల్లా ప్రజలకు ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చాయి. మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం త‌ప్పింది. బోధ‌నాసుప‌త్రిలో ఓపి, స‌ర్జ‌రీ, ఫిజియోథెర‌పీ, బ‌యో కెమిస్ట్రీ, ఫార్మ‌కాల‌జీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, సెకాల‌జీ, మైక్రో బ‌యాల‌జీ, ఇఎన్‌టి, ఆఫ్త్మాల‌జీ, ఎస్‌పిఎం, మెడిక‌ల్ స‌ర్జ‌రీ, గైనిక్‌, పిడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, రేడియాల‌జీ, డెర్మ‌టాల‌జీ, సైకియాట్రీ త‌దిత‌ర విభాగాలు ఏర్పాటయ్యాయి. వీట‌న్నిటికీ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, ఇత‌ర అత్యున్న‌త విద్యార్హ‌త‌లు క‌లిగిన నిపుణులను డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ నియ‌మించింది. ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫోస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్లు త‌దిత‌ర‌ బోధ‌నా సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, ఆఫీస్ స‌బార్డినేట‌ర్లు, బ‌యో కెమిస్టులు, స్టీర్ కీప‌ర్లు, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్లు, అటెండెంట్లు, మెడికో సోష‌ల్ వ‌ర్క‌ర్లు, హెల్త్ అసిస్టెంట్లు త‌దిత‌ర‌ బోధ‌నేత‌ర సిబ్బంది భ‌ర్తీకి గాను మొత్తం 222 పోస్టులను ప్ర‌భుత్వం మంజూరు చేసింది. క‌ళాశాల‌ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ప‌ద్మ‌లీల‌ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 150 పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. మ‌రో 72 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..