AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా మాజీమంత్రి.. త్వరలో ప్రకటించనున్న అధిష్ఠానం..

నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రస్తావన రాగానే అది వైసీపీ అడ్డాగా చెబుతుంటారు. అలాంటి జిల్లాలో నెల్లూరు సిటి నియోజకవర్గం ప్రస్తావన రాగానే టక్కున గుర్తొచ్చే నేత మాజీమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. వైసీపీలో ఫైర్ బ్రాండ్‎గా పేరుంది అనిల్ కుమార్ యాదవ్‎కు. జిల్లాలో పార్టీ అధికారంలో లేకుంటే ఎంతమంది పార్టీ వీడకుండా ఉంటారు అంటే ఖచ్చితంగా చెప్పలేం.

CM Jagan: ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా మాజీమంత్రి.. త్వరలో ప్రకటించనున్న అధిష్ఠానం..
Former Minister Anil Kumar Yadav
Ch Murali
| Edited By: Srikar T|

Updated on: Jan 29, 2024 | 3:09 PM

Share

నెల్లూరు జిల్లా రాజకీయాల ప్రస్తావన రాగానే అది వైసీపీ అడ్డాగా చెబుతుంటారు. అలాంటి జిల్లాలో నెల్లూరు సిటి నియోజకవర్గం ప్రస్తావన రాగానే టక్కున గుర్తొచ్చే నేత మాజీమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. వైసీపీలో ఫైర్ బ్రాండ్‎గా పేరుంది అనిల్ కుమార్ యాదవ్‎కు. జిల్లాలో పార్టీ అధికారంలో లేకుంటే ఎంతమంది పార్టీ వీడకుండా ఉంటారు అంటే ఖచ్చితంగా చెప్పలేం.. కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాస పాత్రుడిగా, జగన్ సైనికుడిగా నిలుస్తారన్న పేరుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2019లో మాజీమంత్రి నారాయణను ఓడించిన అనిల్‎కు మంత్రి పదవి కూడా దక్కింది. మరోసారి నారాయణ టీడీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. రెండోసారి నారాయణపై విజయం సాధించడంతో పాటు హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. అలాంటి సమయంలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా బీసీని నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ అన్నివిధాల సరిపోయే అభ్యర్థిగా మాజీమంత్రి అనిల్ కుమార్‎ను అభ్యర్ధిగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పరిచయం ఉన్న నేతగా అనిల్ అక్కడ పోటీ చేస్తే లోక్ సభ‎తో పాటు ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై కూడా అనుకూలంగా ఉంటుందన్న వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకుంది. మూడోసారి గెలుపు కోసం మొత్తం వర్కవుట్ చేసుకున్న అనిల్ అధినేత జగన్ కోరడంతో కాదనలేక నర్సారావుపేట నుంచి పోటీకి ఒప్పుకున్నారట.

దీంతో నెల్లూరు సిటి స్థానం ఖాళీ అయింది. నెల్లూరు జిల్లా వైసీపీ టికెట్ల విషయంలో దాదాపు క్లారిటీ ఉంది. కానీ ఒక్క స్థానానికి తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఖాళీ ఏర్పడింది. ఆ సీటు కోసం ఇప్పుడు తీవ్రమైన ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆశావహులు. కానీ అధిష్టానం దృష్టిలో ఉన్నది మాత్రం ఆ ఇద్దరేనట. నిన్నటి దాకా మరో అభ్యర్థి ప్రస్తావన కూడా లేని ఇక్కడ నుంచి ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అభ్యర్థులుగా ఉండగా.. రెండు సార్లు బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్ పోటీ చేశారు. ఈసారి కూడా అతనే అభ్యర్థిగా ఉండగా అనూహ్య పరిణామంతో కొత్తవారిని బరిలో దింపాల్సిన పరిస్థితి. అవకాశం కోసం ఆశావహుల జాబితా పెద్దదే ఉంది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారాకనాథ్, వైసీపీ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, మరో నాయకులు సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఇద్దరి పేర్లు అధిష్టానం వద్ద అప్షన్లుగా ఉన్నట్లు సమాచారం. ఒకరు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, టీటీడీ ఉత్తరాది ఆలయాల ఛైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఈ ఇద్దరిలోనే ఒకరిని నెల్లూరు సిటి నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉందట అధిష్టానం. అధినేత జగన్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారట. నారాయణతో తలపడాలంటే ఆర్ధికంగా బలమైన నేత అభ్యర్థి ఉండడం మంచిదన్న ఆలోచనలో ఉందట వైసీపీ అధిష్టానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..