AP News: స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు.. కంక్లూజన్ ఇదే
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే స్పందించారు. వ్యక్తిగతంగా వివరణ ఇచ్చేందుకు స్పీకర్ చాంబర్‌కు చేరుకున్నారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ఉన్నారు.
అమరావతి, జనవరి 29: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెట్టి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఇక టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల్లో మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ ఉండగా జనసేన రెబెల్ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు.
స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు..పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు చూపాలని కోరారు. చట్టవిరుద్ధంగా అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని కోటంరెడ్డి స్పీకర్ ఎదుట ప్రస్తావించారు. మరోవైపు తనకు ఆరోగ్యం సరిగాలేకపోయినా నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు ఉండవల్లి శ్రీదేవి. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హతపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు వివరణ పూర్తి కావడంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
రాజ్యసభ ఎన్నికల్లో ఓటమిభయంతోనే అధికారపార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. సమాచారం ఇవ్వకుండా వాట్సాప్‌లో నోటీసులు పంపారని, ఇప్పుడు సమయం ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. మరోవైపు స్పీకర్‌ను సమయం అడిగాము..ఆయన ఏం చేస్తారో చూడాలంటున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి.
ఏపీ స్పీకర్ నలుగురు వైసీపీ రెబెల్, నలుగురు టీడీపీ రెబెల్, ఒక జనసేన రెబెల్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఇవాళ ఇదే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాంను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇచ్చారు. వీళ్లు ఇచ్చే వివరణను బట్టి అనర్హత వేటుపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉండటంతో వచ్చే నెల 2 వరకు గడువు కావాలని మద్దాలి గిరి కోరారని సమాచారం.
మరోవైపు తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడంపై గంటా శ్రీనివాస్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీని ప్రతివాదిగా చేర్చి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ మూడు వారాలపాటు వాయిదా వేసింది న్యాయస్థానం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..