
పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రిగా నేనే హాజరవుతున్నా, ఎమ్మెల్యేలకు మాత్రం ఏమైంది? CMRF చెక్కులను బాధిత కుటుంబాలకు అందచేయలేనంత బిజీగా ఉన్నారా? ప్రభుత్వం సూచించిన కార్యక్రమాల విషయంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పార్టీ పట్ల మీ చిత్తశుద్ధిని శంకించొద్దా? పార్టీ నాయకత్వాన్ని మరీ ఇంత తేలిగ్గా తీసుకుంటారా?… ఇలా పార్టీ నేతలను కఠిన ప్రశ్నలతో కడిగేశారు సీఎం చంద్రబాబు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష జరిపి, అక్కడికక్కడే నిలదీశారు. పార్టీ సెంట్రలాఫీసుకు రావడం ఈవారంలో ఇది రెండోసారి.
పెన్షన్ల పంపిణీ, CMRF చెక్కుల జారీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేల లిస్టు రాసుకుని, వెంటనే నోటీసులిచ్చి సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల మధ్యే ఉండి బాధ్యతగా పని చేయాలి, ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదు అని వార్నింగ్ ఇచ్చారంటే, ప్రక్షాళనపై పార్టీ అధినేత ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థమౌతుంది.
ఏ రాష్ట్రంలో ఇవ్వనంత పెన్షన్‌లిస్తున్నాం… ఇదే పార్టీకి ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్… అందుకే దీన్ని పండుగలా నిర్వహిద్దాం అనేది చంద్రబాబు అభిప్రాయం. ప్రతీనెలా ఆరంభంలో ఆమేరకు శ్రమిస్తున్నారు కూడా. కానీ, కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీస్కోవడం ఆయన దృష్టికొచ్చింది. ప్రజాసేవ అంటే తాత్కాలిక ప్రచారం కాదు, నిరంతర బాధ్యత అని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. CMRF చెక్కుల పంపిణీ వ్యవహారంపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యే ఇలాంటి అరుదైన సందర్భాల్ని ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.
ప్రజా దర్బార్లు నిర్వహించకపోవడం, ప్రజల సమస్యల పరిష్కారానికి దూరంగా ఉండటం, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లోనూ నిర్లక్ష్యం చూపడం.. ఇలా రకరకాల కంప్లయింట్లతో 48 మంది సీఎం హిట్‌లిస్టులో చేరిపోయారు. వీళ్లలో 90 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు. ఫస్ట్‌టైమర్లే బాధ్యతగా ఉండకపోతే ఎలా అని సూటిగా అడిగేశారు పార్టీ అధినేత. ప్రజా సేవ, పార్టీపై నిబద్ధత … ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇదే నిర్లక్ష్యం రిపీటైతే, పద్ధతి మార్చుకోకపోతే యాక్షన్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
అధికారంలోకొచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ప్రజల్లో పార్టీ స్థితిగతుల్ని లెక్కగట్టుకోవాల్సిన కీలక సమయం ఇది. అందుకే, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తూ, ఇంటిలిజెన్స్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు అధినేత చంద్రబాబు. దాదాపు 40 శాతం మంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పుతున్నట్టు గ్రహించి, గట్టిగా మందలించారు. ఇంతకీ ఆ 48 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌ని హీటెక్కిస్తున్న టాపిక్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..