ఏపీ అభివృద్ధి కోసం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఆదివారం విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. P4 కాన్సెప్ట్ పేపర్‌ను ఆదివారం విడుదల చేస్తామని తెలిపారు. అన్ని స్థాయిల్లో చర్చలు జరిగాక.. సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని P4 విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తామన్నారు. పెట్టుబడి తిరిగి వచ్చే వరకు కొంత విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటి యజమానికి యూనిట్‌ను అప్పగిస్తామన్నారు.
ఇక తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి. తాను కూడా అందుకే ప్రతి ఏటా సంక్రాంతికి సొంతూరుకు వెళ్తున్నట్టు చెప్పారు. తన సతీమణి కోరిక మేరకు పాతికేళ్ల నుంచి సొంతూరు వెళ్తున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు.
సొంతూళ్లకు వచ్చే వాళ్లకు ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్టీసీని సీఎం ఆదేశించారు. ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకోవాలన్నారు. ఫిట్‌నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంత మేర ఇబ్బందుల్లేకుండా ఉంటుందని సీఎం చంద్రబాబు అధికారులతో పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..