
బాబు పాలనలో పగ, ప్రతీకారాలకు చోటుండదంటూ టీడీపీ తన అధికారిక వెబ్ సైట్లో స్పష్టం చేసింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ బ్యాగులను ఈ ఏడాది తమ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పంపిణీ చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని పాలనాపరమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. తాజాగా ఈవిషయాన్ని తిరుమల వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం చాలా వెనుకబడిందన్నారు. అందులో భాగంగానే మాటలకు తగ్గట్టు చేతలకు పనిపెట్టారు. గతంలో విద్యా కనుక పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడికి వెళ్లే పిల్లలకు ఒక కిట్‌ను అందజేశారు. అందులో స్కూల్ బ్యాగు, నోట్ పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, సాక్సులు, బెల్డ్, టై అన్నింటినీ కలిపి విద్యార్థులకు అందజేసేవారు. అయితే అలా పంపిణీ చేసే కిట్ పై జగన్ బొమ్మను ముద్రించి ఇచ్చే వారు.
అయితే ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ఏడాది జగన్ బొమ్మను ముద్రించి ఉంచిన విద్యాకానుక కిట్నే పంపిణీ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం పాత వాటిని పక్కనపెట్టి.. కొత్తగా కిట్‌ను తయారు చేసి పిల్లలకు అందజేయాలంటే నిధులు వెచ్చించాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ ఖజానాలోని నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక జగన్ ఫోటో ఉన్న బ్యాగులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. దీంతో తెలుగుదేశం హయాంలో కూడా స్కూల్ పిల్లలు మాజీ ముఖ్యమంత్రి జగన్ బొమ్మను కలిగిన స్కూల్ కిట్‌ను తీసుకోవాల్సి వచ్చింది. దీనికి తెలుగుదేశం పార్టీ తమ అధికారిక వెబ్ సైట్లో ఒక సందేశాన్ని జోడించింది. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు ఎక్కడ మంచిపేరు వస్తుందో అనే ఆలోచనతో అన్నా క్యాంటీన్లను రద్దు చేసి.. పేదల కడుపు కొట్టిన గత ముఖ్యమంత్రికి, ప్రస్తుతం నిధులు దుర్వినియోగం చేయకూడదు అన్న ఆలోచనతో కూడిన సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం ఇదే అని తెలిపింది. అందుకే గత ముఖ్యమంత్రిలాగా కాకుండా విద్యాకానుక కిట్లపై జగన్ బొమ్మలు ఉన్నప్పటికీ వాటిని అలాగే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. తమ పాలనలో పగ, కక్షసాధింపు చర్యలు ఉండవన్నదానికి ఇదే ఒక ప్రత్యేక ఉదాహరణ అంటూ సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతోంది.
బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ… జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు.#TDP… pic.twitter.com/Q76iAcrbYN
— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…