AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: వారికి 25 వేలు.. వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు.. పూర్తి వివరాలు ఇవే..

ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడామని...

Chandrababu: వారికి 25 వేలు.. వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు.. పూర్తి వివరాలు ఇవే..
CM Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Sep 17, 2024 | 9:55 PM

Share

రాజధానికి వరద వస్తుందన్న నేతల నాలుకకు తాళం వేస్తా.. అమరావతిపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు చెన్నై, ముంబైలాంటి రాజధానులను మార్చమని చెప్పండి.. ఏ ప్రాంతంలోనైనా వరదలు వస్తాయంటూ పేర్కొన్నారు. బుడమేరు ప్రాంతంలో ప్రాపర్టీ ట్యాక్స్‌ చెల్లింపునకు గడువు ఇస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడామని.. డబ్బులు ఇచ్చి ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామన్నారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వరద బాధితులకు సాయం ప్రకటించారు. 179 సచివాలయాల పరిధిలో ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. చరిత్రలో తొలిసారి ఇంటికి రూ.25వేలు ఇస్తున్నామన్నారు. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌ వారికి రూ.10 వేల సాయం.. చిన్న వ్యాపారులకు రూ.25 వేల సాయం అందిస్తామన్నారు. MSME టర్నోవర్‌ రూ.40 లక్షలలోపు ఉంటే రూ.50 వేలు, రూ.40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్‌ వరకు రూ.లక్ష, అంతకు మించి టర్నోవర్‌ ఉంటే రూ.లక్షన్నర సాయం అందిస్తామని చెప్పారు.

పాడైన త్రీ వీలర్స్‌కి రూ.10 వేల సాయం, టూ వీలర్స్‌కి రూ.3 వేలు సాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. అవసరమైన వారికి తోపుడు బండ్లు ఉచితంగా ఇస్తామన్నారు. చేనేత కార్మికులకు రూ.15 వేల సాయం, కిరాణాషాపులకు రూ.25 వేల సాయం, పాక్షికంగా దెబ్బతిన్న ఫిషింగ్‌ బోట్లకు రూ.9 వేలు, పూర్తిగా దెబ్బతిన్న బోట్లకు రూ.20 వేల సాయం అందిస్తామని చెప్పారు.

దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. హెక్టార్‌కు రూ.25 వేలు సాయం అందిస్తామన్నారు. పంట రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని చెప్పారు. వ్యాపారుల రుణాలకు ఏడాది మారటోరియం ఇస్తామన్నారు.

త్వరలోనే ఆపరేషన్‌ బుడమేరు మొదలుపెడతామని.. రేపు కేబినెట్‌లో ఈ అంశంపై చర్చిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. బుడమేరులో ఆక్రమణలు తొలగిస్తాం.. హైడ్రా అనేది హైదరాబాద్‌కు సంబంధించినది.. ఇక్కడ పేరు ఏదైనా ఆక్రమణలు తొలగిస్తామంటూ చంద్రబాబు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..