బ్యాంకర్ల కమిటీ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 500, రూ. 200 నోట్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బ్యాంకులు వంద శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలన్నారు. దీని కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి. వ్యవసాయానికి ఊతమివ్వండి.. కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి అంటూ బ్యాంకర్లను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. 5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ రంగానికి రూ. 2,64,000 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. MSME రంగానికి 2023-24లో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు, సాంప్రదాయేతర ఇంధన సెక్టార్‌కు రూ. 8 వేల కోట్లు రుణాలు ఇవ్వనున్నారు.
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని.. వాటిని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు చంద్రబాబు. కీలక అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. 5 అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. బ్యాంకులు వంద శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఇది ఒక దీర్ఘకాలిక పాలసీ అని గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల డబ్బులు ఏ అకౌంట్లలో ట్రాన్స్ ఫర్ అవుతుందో ట్రాక్ చేసేందుకు సులువుగా ఉంటుందని తెలిపారు. అదేక్రమంలో పేదరికం నిర్మూలనకు కొత్తగా P4 విధానం తీసుకువస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడంపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టిందని, స్కిల్ డెవలప్‌మెంట్‌కు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ స్టడీ చేయాలని సూచించారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ రైతులకు కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రజలు చంద్రబాబు సర్కార్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చడానికి బ్యాంకుల సహకారం అవసరమన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..