YCPలో నెం.2 ఆయనేనా..? పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీ..!

| Edited By: Ravi Kiran

Nov 19, 2024 | 9:07 AM

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత తగ్గిందా? ఇప్పుడు పార్టీలో నెం.2 ఎవరు? తదితర ప్రశ్నలకు వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేసింది.

YCPలో నెం.2 ఆయనేనా..? పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీ..!
YCP Chief YS Jagan
Follow us on

వైసీపీలో మళ్ళీ పాత నాయకత్వానికి పెద్ద పీట వేస్తూ.. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేలా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని ముందుండి నడిపించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను మొత్తాన్ని తనకు నమ్మిన బంటుగా ఉన్న సజ్జలకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వైసిపి తరఫున అన్ని తానై పార్టీని ముందుకు నడిపారు. ఓ రకంగా పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో సజ్జల నిర్ణయమే ఫైనల్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన వ్యవహారాలన్నీ సజ్జల కనుసన్నల్లో నడిచాయి. కీలక విషయాల్లో జగన్ ఆదేశాల మేరకు సజ్జల పార్టీని ముందుకు నడిపారు. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు పరిష్కరించడంలోనూ సజ్జల కీ రోల్ ప్లే చేశారు. ప్రతిపక్షంలో ఉన్న టిడిపికి పార్టీపరంగా కౌంటర్ ఇవ్వడంలోనూ సజ్జల యాక్టివ్ రోల్ పోషించారు.

జగన్ పక్కన పెట్టేశారని ప్రచారం..

2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. సజ్జలపై సొంత పార్టీకి చెందిన నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కొందరు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఓ రకంగా ఎన్నికలకు ముందు నుంచే కొందరు నేతలు సజ్జలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  వైసీపీలో సజ్జల తప్ప ఏ ఒక్కరు కూడా పార్టీ అధినేత జగన్‌ను కలిసేందుకు అవకాశం లేకుండా పోయిందంటూ గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో సజ్జల టార్గెట్గా సొంత పార్టీ నేతల నుంచి విమర్శల తీవ్రత మరింత పెరిగింది.  పార్టీలో నెలకొన్న విబేధాలకు సజ్జలే కారణమని కొందరు నేతలు ఆరోపించారు. సజ్జలతో పాటు ఆయన కుమారుడైన సజ్జల భార్గవరెడ్డిపై కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెళ్లడైన నాటి నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల మీడియా ముందుకు చాలా తక్కువ సందర్భాల్లోనే వచ్చారు. మీడియా సమావేశాలే కాదు.. పార్టీకి సంబంధించిన సమావేశాలను ఆయన పెద్దగా నిర్వహించలేదు. దీంతో సజ్జలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారని సొంత పార్టీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

Sajjala Ramakrishna Reddy

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సజ్జల పత్తా లేకుండా పోయారని పెద్ద చర్చ నడుస్తోన్న వేళ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసిపి కో ఆర్డినేటర్‌గా సజ్జలను నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు. సజ్జలకు పార్టీలో కీలక పదవిని కట్టబెట్టడం వైసీపీ వర్గాలు కూడా ఊహించని పరిణామం. దీంతో సజ్జలకు కీలక పదవి ఇవ్వడంపైనే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో సజ్జల నిర్వహించిన అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిలో మూడు నెలల క్రితం చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమించారు. ఇప్పుడు సజ్జలకు కో ఆర్డినేటర్ బాధ్యతలను జగన్ అప్పగించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగానే మొత్తం పార్టీ వ్యవహారాలను నడపడంలో కో ఆర్డినేటర్ బాధ్యతలు కీలకం. ఈ కీలకమైన పదవిలో సజ్జలను నియమించడంతో.. పార్టీలో సజ్జలకు ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత సజ్జల టార్గెట్‌ చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎలా స్పందించాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారు.

మరో వైపు సజ్జల నియామక వెనక భారీ అంచనాలు ఉన్నాయన్న చర్చ వైసీపీలో చర్చ నడుస్తుంది. గత ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో జగన్ ఆదేశాలతో నడిపించిన సజ్జలకు ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో అందరితోటి మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే కార్యకర్తలను, నేతలను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకతాటిపై తీసుకురావడం.. కీలక పదవుల్లో కొత్తవారి నియమిస్తే కొత్త సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశముంది. పార్టీ డైరెక్షన్లో అందరూ పనిచేసేలా సమన్వయం చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే బెటర్ అన్న బావనలో పార్టీ అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కోఆర్డినేటర్ వంటి కీలకమైన బాధ్యతను సజ్జలకు అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జగన్‌కి నమ్మిన బంటుగా.. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే సజ్జలు అయితేనే ఆ బాధ్యతకు కరెక్ట్ జగన్ భావించినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ.. ఎక్కడా సజ్జల జగన్ ఆదేశాలకు విరుద్ధంగా అడుగులు వేయలేదు. గతంలో పార్టీలో కీలకమైన బాధ్యతలను భుజాన వేసుకొని విజయసాయిరెడ్డి నడిపించారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాంతాలవారీగా పార్టీ ఇంఛార్జ్‌ల నియామకం చేసి వారిని ఐక్యం చేసే దిశగా ఇప్పటినుంచి జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం సజ్జల నియామకం జరిగినట్లు తెలుస్తోంది.

కోఆర్డినేటర్‌గా సజ్జల అయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు అందరిని ఏకతాటిపైకి తీసుకురావచ్చని ఆయన వైపు జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  మొత్తానికి సజ్జలకు కీలక పదవి అప్పగించడంతో.. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత విషయంలో గత కొన్ని మాసాలుగా పార్టీ వర్గాల్లో నెలకొన్న గందరగోళానికి వైసీపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టినట్టయ్యింది. కీలక పదవిలో సజ్జలను నియమించడంతో వైసీపీలో నెం.2 ఇప్పటికీ సజ్జలే కొనసాగుతారని పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసినట్టేనని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.