Vizag – Vijayawada: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు.. టైమింగ్స్ ఇవిగో

|

Oct 27, 2024 | 6:27 PM

విశాఖ.. విజయవాడ.. ఒకటి ఏపీలోనే అతిపెద్ద నగరం. మరొకటి రాజధానికి ఆనుకుని ఉన్న నగరం. ఈ రెండు నగరాల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతోంది. ముఖ్యంగా విమాన సర్వీసులను పెంచుతోంది ప్రభుత్వం. తాజాగా మరికొన్ని విమాన సర్వీసులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఈ కొత్త సర్వీసుల టైమింగ్స్ ఏంటి? వాటిల్లో టికెట్ ఎంత?

Vizag - Vijayawada: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు.. టైమింగ్స్ ఇవిగో
Flight
Follow us on

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. ఇక రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న నగరం విజయవాడ. అందుకే ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రెండు నగరాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో విమాన ప్రయాణానికి ఎక్కువమంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్తగా అందుబాటులోకి రెండు సర్వీసులు

విశాఖ నుంచి విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు.. విశాఖ విమానాశ్రయంలో ఈ సర్వీసులను ప్రారంభించారు. కొత్త సర్వీసులతో ఈ రెండు నగరాల మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరింది.

ఉదయం 9:35 గంటలకు ఎయిర్‌ ఇండియా సర్వీస్

తాజాగా ప్రారంభమైన సర్వీసుల్లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటోంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ వెళ్తుంది. ఇండిగో సర్వీసు ఉదయం 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే ఫ్లైట్ రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది.

ప్రస్తుతం విశాఖ – విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే

ప్రస్తుతం విశాఖ – విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే నడుస్తోంది. కానీ ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వీసులను పెంచామన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఎక్కువ ఫ్లైట్లు అందుబాటులోకి రావడంతో టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. విశాఖ వెళ్లేవాళ్లు.. వచ్చేవాళ్లకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి

విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం. దీనిని మరింత అభివృద్ధి చేయడానినికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టవిటీ ఎంతో అవసరమన్నారు. విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మించడమే కాకుండా.. ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..