చదువు వస్తే ఉన్న మతి పోయినట్లుంది అక్కడి ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. ఆపరేషన్‌కు ముందు అన్ని చెక్ చేసుకోవాల్సిన వైద్యులు.. సర్జరీ ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. అసలేం జరిగింది? దీనిపై ప్రశ్నిస్తే ఆ వైద్యుల నిర్లక్ష్యం అనుకోకుండా వారే స్వయంగా బయట పెట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. ఎముకల సర్జరీకి వాడే ప్లేట్లను సమకూర్చుకోకుండా ఆపరేషన్ ప్రారంభించిన వైద్యులు మధ్యలో నిలిపివేశారు. యాదమరి మండలానికి చెందిన వృద్ధురాలు పుష్పమ్మ బాత్రూంలో జారిపడింది. వైద్యం కోసం బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. బంధువులకు కొన్ని షరతులు కూడా విధించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో లేనివి బయట నుంచి తీసుకురావాలన్నది వాటి సారాంశం.
పుష్పమ్మకు ఆపరేషన్ చేయాలని చెప్పిన వైద్యులు ఎక్స్‌రే, స్కానింగ్ టెస్ట్‌లు బయట ప్రైవేట్‌గా చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సర్జరీ ప్రారంభించిన డాక్టర్లు తొడ ఎముకకు అమర్చాల్సిన ప్లేట్లు లేవని తెలియడంతో అర్ధాంతరంగా ఆపేశారు. నోరు జారి పుష్పమ్మ కుమారుడి దగ్గర ఈ విషయం బయటపెట్టారు. ఆపై తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. పుష్పమ్మ ఆరోగ్యం నిలకడగా లేదంటూ మాట దాటవేశారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆపరేషన్ నిలిపేశారని బంధువులు ఆగ్రహిస్తుంటే.. ఆమె ఎముక మెత్తగా ఉన్న కారణంగా సర్జరీ సక్సెస్ కాదని నిలిపివేశామని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై హాస్పిటల్‌లో గందరగోళం నెలకొంది. దీనిపై విచారణకు ఆదేశించారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..