
సమ్మర్ అంటేనే హాలీడేస్. హాలీడేస్ అంటే పిల్లలకు జాలీడేస్. కానీ ఎంతో సరదాగా గడవాల్సిన ఈ రోజులు.. కొంతమందికి తీరని గుండెకోతను మిగుల్చుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం ఊహించని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదాలు చెప్పి రావు. అందుకే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. అందులోనూ పిల్లలు ప్రమాదం బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత పెద్దలదే. వారి విషయంలో ఏమీ కాదులే అని ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా.. దాని ఫలితం ఊహించనంతా దారుణంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటన విషాదకరమైన సంఘటనే చోటుచేసుకుంది. ద్వారపూడి గ్రామంలో ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ఓ కారులో చిక్కుకుపోయి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం దగ్గర నిలిపి ఉంచిన ఓ పాత కారులో పిల్లలు కదలకుండా పడి ఉండటాన్ని కొందరు గమనించారు. వెంటనే కారు దగ్గరకు వెళ్లి చూడగా, అప్పటికే నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి కనిపించారు. సరదాగా ఆడుకునేందుకు కారులోకి వెళ్లిన చిన్నారులు, ప్రమాదవశాత్తూ డోర్లు లాక్ అయిపోవడంతో ఊపిరాడక చనిపోయారు. మరణించిన చిన్నారులను ఉదయ్, చారుమతి, చరిష్మా , మనస్విగా గుర్తించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో నీటి గుంతలోపడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఓ ఇంటి పునాది కోసం తవ్విన గుంతలో వర్షం నీరు చేరింది. ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన ఈ ముగ్గురు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు బాలికలు ఓ బాలుడు ఉన్నారు తమ పిల్లలు విగత జీవులుగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో జల్లేరు జలాశయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తాడేపల్లిగూడెంకు చెందిన షేక్ అబ్దుల్, షేక్ సిద్దిక్, జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ నుంచి దొరమామిడి సమీపంలోని జల్లేరు జలాశయం వద్ద సరదాగా గడిపేందుకు వెళ్లారు. డ్యామ్ వద్ద అందరూ కూర్చొని ఉండగా చిన్నారులు నీటిలోకి దిగి మునిగిపోయారు. చేపలు పట్టే వల సాయంతో చిన్నారుల మృతదేహాలు బయటకు తీశారు.
ఇలా వేర్వేరు ఘటనల్లో ఒకే రోజు 9 మంది పిల్లలు చనిపోయారు. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఈ రకంగా విగతజీవులుగా మారడానికి కారణం.. వారిపై తల్లిదండ్రులు, బంధువులు దృష్టి పెట్టకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా వేసవి సెలవులు ఉండటంతో.. తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలు ఏం చేస్తున్నారు. ఎటు వెళుతున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..