Ongole: “అమ్మా ఐలవ్‌యూ… నా బెస్ట్ ఫ్రెండ్‌ నువ్వే”.. క్రికెట్ బెట్టింగ్‌తో అప్పులపాలై.. ఉరికి వేలాడాడు

అమ్మా ఐలవ్‌యు... నా బెస్ట్ ఫ్రెండ్‌ నువ్వే... నాకోసం చాలా కష్టపడ్డావు... నీ కొడుకుకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు ఏనాడు ఊహించి ఉండవు... ఐపియల్ వల్ల నా లైఫ్, నా ఫ్యామిలీ, నా కెరీర్‌ మొత్తం నాశనమైందని సూసైడ్‌ నోట్‌లో రాశాడు... ఐపియల్‌లో డబ్బులన్నీ పోయాయి... అందుకే చనిపోతున్నా అంటూ......

Ongole: అమ్మా ఐలవ్‌యూ... నా బెస్ట్ ఫ్రెండ్‌ నువ్వే.. క్రికెట్ బెట్టింగ్‌తో అప్పులపాలై.. ఉరికి వేలాడాడు
Suicide Note
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 01, 2023 | 5:00 PM

“అమ్మా ఐలవ్‌యూ… నా బెస్ట్ ఫ్రెండ్‌ నువ్వే… నాకోసం చాలా కష్టపడ్డావు… నీ కొడుకుకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు ఏనాడు ఊహించి ఉండవు…” అంటూ సూసైడ్ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. ఒంగోలులో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి మృతుడు సూసైడ్ నోట్‌లో రాసిన వివరాలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఆ బాధలో మద్యానికి బానిసగా మారి కుటుంబాన్ని ఇబ్బందులు గురిచేశాడన్నది సారాంశంగా ఉంది. ఇటీవల కాలంలో బెట్టింగ్‌లకు పాల్పడి ఇళ్ళు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్న యువకుల ఉదంతాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. క్రికెట్ ఆటను ఆస్వాదించకుండా దానిపై బెట్టింగ్‌లు కాస్తూ కోట్లు గడిస్తున్న బెట్టింగ్ రాయుళ్ళ ప్రలోభాలకు గురై చాలా మంది యువకులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయి… దొరికితే దొంగలు… లేకుంటే దొరలు అన్న చందంలా బెట్టింగ్ నిర్వాహకులు రాజకీయ నేతల అండదండలతో తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకుంటూ కోట్లు పోగేసుకుంటున్నారు. స్టేడియం లోపల క్రికెట్‌ ఆటగాళ్ళు కోట్లకు అమ్ముడుపోయి కోటీశ్వరులవుతుంటే … స్టేడియం బయట డబ్బులు పోగొట్టుకున్న బెట్టింగ్ ఆటగాళ్ళు మాత్రం బికారులుగా మారుతున్నారు… ఇలాంటి ఉదంతమే చిలకలూరిపేటకు చెందిన యువకుడి రూపంలో ఒంగోలులో వెలుగు చూసింది.

చిలకలూరిపేటకు చెందిన కోట రామకృష్ణ ఇలాగే బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి రామకృష్ణను పెంచి పెద్ద చేసింది. ఆర్ధిక స్తోమత పెద్దగా లేని కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణ తల్లి కష్టానికి చేదోడువాదోడుగా ఉండేందుకు పలు దుకాణాల్లో గుమాస్తాగా పనిచేసేవాడు వ్యాపార వర్గాల సామాజికవర్గానికి చెందిన రామకృష్ణ తాను పనిచేసే దుకాణాల్లో యజమానులతో నమ్మకంగా వ్యవహరించేవాడు. రామకృష్ణకు పెళ్ళయింది… ఖర్చులు పెరిగాయి… చేసే కొలువులో పెద్దగా ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. ఈ క్రమంలో ఐపియల్‌ క్రికెట్‌వైపు రామకృష్ణ దృష్టి పడింది… ముందు నుంచి క్రికెట్‌ ఆట పట్ల ఆశక్తి కనబరిచే రామకృష్ణ ఈ ఆటలో ఎవరు ఏ ఓవర్‌లో సిక్స్‌ కొడతారు… పోర్‌ కొడతారు… అలాగే ఎవరి బౌలింగ్‌లో ఏ ఆటగాడు ఔట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు తన స్నేహితులకు చెబుతుండేవాడు… ఈ క్రమంలో బెట్టింగ్‌లు కడితే డబ్బులు వస్తాయన్న ఆలోచనతో తన దగ్గర ఉన్న డబ్బులతో తొలుత బెట్టింగ్‌ కాశాడు. ముందు కొంతమేరకు తన అంచానాలు ఫలించి డబ్బులు వచ్చాయి. ఆ తరువాత ఈ బెట్టింగ్‌ వ్యవహారం రామకృష్ణకు వ్యసనంగా మారింది. దీంతో అప్పులు చేసి మరీ బెట్టింగ్‌లు కాశాడు. ఈసారి అదృష్టం మొహం చాటేసింది… వరుసగా డబ్బులు పోయాయి.. సుమారు రెండు లక్షల వరకు బెట్టింగ్‌లో పొగొట్టుకున్నాడు.

చిన్న కుటుంబం నుంచి వచ్చిన రామకృష్ణకు రెండు లక్షలు ఎక్కువే… ఈ విషయంలో తాను ప్రాణంగా చూసుకుంటున్న తల్లికి చెప్పలేక, భార్యకు తెలియడం ఇష్టంలేక లోలోపలే మదనపడ్డాడు… చివరకు అనుకున్నట్టుగానే బాధలు మరిచిపోయేందుకు మద్యానికి బానిసగా మారాడు… ఒకవైపు అప్పులు, మరోవైపు తాగుడు రెండూ కలిసి రామకృష్ణను విచక్షణ కోల్పోయేలా చేశాయి… తన తల్లి తన కోసం పడిన కష్టాన్ని మరిచిపోయాడు… తనను నమ్మి తాళి కట్టించుకుని కాపురానికి వచ్చిన భార్య పరిస్థితిని అర్ధం చేసుకోలేకపోయాడు… చివరకు ఈ లోకం నుంచి తాను వెళ్ళి పోవాలని నిర్ణయించుకున్నాడు… మే 30వ తేదిన నేరుగా ఒంగోలుకు వచ్చాడు… నగరంలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నాడు… ఓ నోట్‌ బుక్‌ తీసుకుని సూసైడ్‌ నోట్‌ రాశాడు… అమ్మా ఐలవ్‌యు… నా బెస్ట్ ఫ్రెండ్‌ నువ్వే… నాకోసం చాలా కష్టపడ్డావు… నీ కొడుకుకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నువ్వు ఏనాడు ఊహించి ఉండవు… ఐపియల్ వల్ల నా లైఫ్, నా ఫ్యామిలీ, నా కెరీర్‌ మొత్తం నాశనమైందని సూసైడ్‌ నోట్‌లో రాశాడు… ఐపియల్‌లో డబ్బులన్నీ పోయాయి… అందుకే చనిపోతున్నా అంటూ… తన స్నేహితురాలిగా, ప్రాణ సమానురాలిగా ప్రేమించిన తల్లిని ఉద్దేశించి అంతులేని ఆవేదనతో మరణ లేఖను రాసి ఆత్మహత్య చేసుకున్నాడు… మే 30 వ తేదిన ఉదయం పదిన్నర గంటలకు ఒంగోలులోని లాడ్జిలో రూం తీసుకుని మధ్యాహ్యానికి ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయాడు… లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే చేరుకున్న పోలీసులు రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు… ఈ ఘటనపై అనుమానాస్పద మృతి సెక్షన్‌ 174 కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..