CJI NV Ramana: దేశంలోని ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం కష్టంగా మారిందన్నారు. శుక్రవారం నాడు తిరుపతిలో పర్యటించిన జస్టిస్ ఎన్వీ రమణ.. మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ.. భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతి ప్రజలు ప్రజాభిమానం ఉన్న నాయకుడిని ఎన్నుకున్నారని అభినందించారు. పార్టీలు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. భూమనను ఉన్నత స్థానంలో ఎందుకు ఉంచడం లేదోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా.. భూమన తనకు ఆత్మీయుడిగానే ఉన్నారని పేర్కొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. తిరుపతిలో మరోసారి తెలుగు భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తి చేశారు సీజేఐ రమణ. ప్రస్తుత జనరేషన్ పిల్లలు గాంధీని మర్చిపోతున్న తరుణంలో ఆయన్ను మరోసారి స్మరించుకునేలా, ఆయన ఆశయాలను కొనసాగించేలా పుస్తకాన్ని రచించడం అభినందనీయం అని ‘మహాత్ముని ఆత్మకథ సత్యశోధన’ పుస్తకంపై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..