Chicken: ‘వేస్ట్’ వివాదంతో మాంసం దుకాణాలు బంద్.. ఏపీలోని ఆ ప్రాంతంలో చికెన్ ప్రియుల సహనానికి పరీక్ష..

|

Dec 18, 2023 | 9:36 PM

కర్నూల్ చికెన్ మసాలా.. ఏంటో అనుకుంటున్నారా..? అయితే, కర్నూలులో కోడిమాంసం చుట్టూ పెద్ద కహానీనే నడుస్తోంది. చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్ కి పిలుపునిచ్చారు. మూడు రోజుల నుంచి నగరంలో చికెన్ సేల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. చికెన్ వ్యాపారులకు, మున్సిపల్ అధికారులకు మధ్య కోల్డ్ వార్ షురూ ఐంది. ఇంతకీ.. ఏమిటీ కర్నూల్ చికెన్ మసాలా.. చికెన్ వేస్ట్ వివాదం అనే ఈ ఎపిసోడ్ ఎందుకింత వేడెక్కింది..?

Chicken: ‘వేస్ట్’ వివాదంతో మాంసం దుకాణాలు బంద్.. ఏపీలోని ఆ ప్రాంతంలో చికెన్ ప్రియుల సహనానికి పరీక్ష..
Chicken Prices
Follow us on

కర్నూల్ చికెన్ మసాలా.. ఏంటో అనుకుంటున్నారా..? అయితే, కర్నూలులో కోడిమాంసం చుట్టూ పెద్ద కహానీనే నడుస్తోంది. చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్ కి పిలుపునిచ్చారు. మూడు రోజుల నుంచి నగరంలో చికెన్ సేల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. చికెన్ వ్యాపారులకు, మున్సిపల్ అధికారులకు మధ్య కోల్డ్ వార్ షురూ ఐంది. ఇంతకీ.. ఏమిటీ కర్నూల్ చికెన్ మసాలా.. చికెన్ వేస్ట్ వివాదం అనే ఈ ఎపిసోడ్ ఎందుకింత వేడెక్కింది..?

కర్నూల్ నగరంలో ప్రతి రోజూ లక్ష కిలోలకు పైగా చికెన్ విక్రయాలు జరుగుతాయి. చికెన్ మార్కెట్లు ఎంత రద్దీగా ఉంటాయో.. ఈ మార్కెట్లో ఏర్పడే వేస్ట్ కూడా కూడా అంతే ఎక్కువ. కోడి కాళ్లు, తల, పేగులు, స్కిన్… వీటన్నిటినీ వేస్ట్‌గా పరిగణిస్తారు. ఈవిధంగా ఒక్కో కోడి నుంచి కనీసం 800 గ్రాముల వ్యర్థం వస్తుంది. ఇప్పుడీ చికెన్ వేస్టే కర్నూల్‌ నగరంలో వివాదానికి మూల కేంద్రం.

చికెన్ వేస్ట్‌నంతా కర్నూల్ నుంచి లారీల్లో విజయవాడ, గోదావరి జిల్లాలు, అలంపూర్ దగ్గర భారీగా ఉన్న చేపల చెరువులకు తరలిస్తారు. సాధారణంగా చేపలకు ఆహారం వేయాలంటే కిలో దాణా ఖర్చు 50 నుంచి 60 రూపాయలు. ఇదే చికెన్ వేస్ట్ ఐతే కేవలం 15కే వస్తుంది. దీంతో చేకెన్ వేస్ట్ పైనే దృష్టి పెట్టాయి పౌల్ట్రీలు. ఇదే అదనుగా చికెన్ వేస్ట్ అమ్మకం అనేది ఒక మాఫియాగా మారింది. వాళ్ల మధ్య పోటీ పెరిగి ఘర్షణలకు దారితీసింది. ఇంకేముంది… షరామామూలుగానే రాజకీయ నేతలు.. ఆ వెమ్మటే నగరపాలక సంస్థ ఎంటరైంది.

కౌన్సిల్లో నిర్ణయించి చికెన్ వేస్ట్‌ని వేలం ద్వారా విక్రయించాలనేది మున్సిపల్ అధికారుల నిర్ణయం. చికెన్ వేస్ట్ తీసుకునేవాళ్ళు చికెన్ సెంటర్లకు ఏటా ఐదు నుంచి పది లక్షలు ఇవ్వాలనేది నిబంధన. కానీ.. అందరూ సిండికేట్‌గా మారడంతో.. వేలంలో చికెన్ వేస్ట్ కోటిన్నర మొత్తానికి ఒకరికే సొంతమైంది. దీంతో తమ ఆదాయానికి గండి కొట్టారని ఆందోళనకు దిగారు చికెన్ వ్యాపారులు. అయినా అధికారులు దిగిరాక పోవడంతో బంద్‌కి పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు చికెన్ విక్రయాలు ఆగిపోయాయి. చికెన్ వేస్ట్ తరలింపును అడ్డుకుంటామని, ఊరంతా కంపు కొడుతుందని హెచ్చరించారు.

కానీ.. మున్సిపాలిటీ వాదన మరోలా ఉంది. వేస్ట్ మాఫియాగా మారి గొడవలకి దిగి, వారే తమ దగ్గరకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు మేయర్ రామయ్య. మొత్తమ్మీద చెకెన్ వేస్ట్ మాఫియా ముదిరి.. కర్నూల్లో చికెన్ ప్రేమికుల సహనానికి పరీక్ష పెట్టడమే కాదు.. ఘర్షణలకు తావిస్తోంది. ఈ వివాదం ఎంతవరకు వెళుతుంది.. ఇంకా ఎన్నిరోజులు చికెన్ లేకుండా ఉండాలి అని ఆందోళనలో ఉంది కర్నూలు ప్రజానీకం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..