మాంసాహార ప్రియుల ఉత్సాహంపై నీళ్లు జల్లుతూ కోడి ధరలు(Chicken Rate) కొండెక్కుతున్నాయి. వారం రోజుల్లోనే చికెన్ ధర కేజీకి రూ. 50 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో చాలా కోళ్లు చనిపోయినట్లు తెలుస్తోంది. డిమాండ్‌కు తగినంత సప్లయ్ లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకూ 200 రూపాయలోపే పలికిన చికెన్ ధర ఇప్పుడు 300 రూపాయలు దాటి.. మటన్‌తో పోటీపడుతోంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో మొదలైన బర్డ్ ఫ్లూ.. రెండు మూడు వారాలపాటు కొనసాగి వేలాదికోళ్లు మృత్యువాతపడేలా చేసింది. దాంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు. మార్కెట్లో ప్రస్తుతం కోళ్లు అందుబాటులో లేకపోవడంతో చికెన్‌కి డిమాండ్ పెరిగింది.
ఏపీలోని అన్ని జిల్లా మార్కెట్లలో చికెన్ ధర కేజీ రూ.300 దాటింది. దాంతో మాంసం ప్రియులు ముక్క దిగడం లేదు. కిలో కొనుక్కోవాల్సిన దగ్గర అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక నాన్‌వెజ్ క్యాటరింగ్ చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. క్యాటరింగ్ ధరలు పెంచలేక.. ఇటు చికెన్ ధరలు చెల్లించలేక సతమతమవుతున్నారు.
మరోవైపు బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ల పెంపకం భారీగా తగ్గిందని, ఇప్పుడు డిమాండ్ పెరగడంతో సప్లయ్ లేక చికెన్ ధరలు పెరుగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. దీనికి తోడు ధరలు పెరగడంతో పెంపకందారులు కోడి బరువు తక్కువగా ఉండగానే అమ్మకాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
వాస్తవానికి రెండు నుంచి రెండున్నర కేజీల బరువు ఉన్న కోళ్లనే విక్రయిస్తారు. ప్రస్తతం కేజీన్నర బరువున్న వాటినీ అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో ఎండవేడికి కోళ్లు ఎక్కువగా చనిపోతుంటాయి. అందువల్ల వీలైనంత వరకు వేసవికి ముందే పెంపకందారులు అమ్మకాలు చేస్తుంటారు. దీంతో ప్రస్తుతం చిన్న రైతుల వద్ద కోళ్లు అయిపోయినట్లు తెలుస్తుంది.
ఏపీలోనే కాదు..తెలంగాణలోనూ చికెన్ ధరలు 3వందలకు చేరువయ్యాయి. నాన్‌వెజ్ ప్రియులు అవాక్కఅవుతున్నారు. సండే వచ్చినా..పెరిగిన ధరలతో చికెన్, మటన్ జోలికి వెళ్లకుండా జిహ్వాచాఫల్యాన్ని చంపుకుంటున్నారు. ధరలు దిగొచ్చే వరకు గుడ్డుకే పరిమితమవ్వాల్సి వచ్చేలా ఉందని చెప్పుకొచ్చారు.
ఏపీ, తెలంగాణ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: Cyclone Asani Live Updates: ఉత్తరాంధ్రలో అసని అలజడి.. ఉప్పాడ సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..
Hyderabad: ప్రేమ జంట రిజిస్ట్రేషన్ మ్యారేజ్.. సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..