AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను ఓడించేంత సీన్‌ లేదు.. 2004, 2019లో ఓటమికి కారణాలు ఇవే: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం, గత ఓటములు, భవిష్యత్తు దృష్టిని వివరించారు. 2004, 2019 ఎన్నికల్లో ఓటమికి తన పనితీరును కారణంగా చెప్పుకొచ్చారు. తెలుగువారి ప్రతిభ, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన నమ్మకం వ్యక్తం చేస్తూ, 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

నన్ను ఓడించేంత సీన్‌ లేదు.. 2004, 2019లో ఓటమికి కారణాలు ఇవే: సీఎం చంద్రబాబు
Cm Chandrababu
Eswar Chennupalli
| Edited By: SN Pasha|

Updated on: Mar 17, 2025 | 4:28 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో నన్నెవరూ ఓడించలేదని, గతంలో జరిగిన పరాజయాలకు తానే కారణమని స్పష్టం చేశారు. 2004, 2019 ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి తన పద్ధతులు, పనితీరు, ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని వెల్లడించారు. “పని, పని అంటూ నేను పని చేశాను. కానీ, కొన్ని కీలకమైన విషయాల్లో సమన్వయం లోపించడమే ఓటమికి కారణం” అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తన విధానాలపైనే పూర్తి నమ్మకం ఉందని, ప్రజల కోసం నిరంతరం పని చేయడంలో ఎలాంటి రాజీపడనని, రాజకీయంగా ఎదురైన ఓటములు తాను చేసిన పనులను కించపరిచేలా కాకుండా మరింత ముందుకు సాగేలా మార్పులే తెచ్చాయని అన్నారు.

“ఎప్పటికీ ప్రజలతోనే ఉండాలి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కానీ, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెడితే, ఓటమికి ఆస్కారం ఉండదు” అని చంద్రబాబు పేర్కొన్నారు. తన హయాంలో అమలు చేసిన పలు సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాన్ని చూపాయని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు, ఐటీ రంగంలో చేసిన విప్లవాత్మక ప్రగతి గురించి ఆయన ప్రస్తావించారు. “గతంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచానికి మార్గదర్శకంగా మారాయి. తెలుగువారి ప్రతిభను గ్లోబల్ స్థాయిలో చాటిచెప్పేలా చేశాయి” అని అన్నారు. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన ప్రాంతానికి వెళ్లి గట్టిగా తెలుగులో మాట్లాడితే పెద్ద సంఖ్యలో తెలుగువారు అక్కడ చేరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, ఇది తాను తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమేనని అన్నారు. “మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించగలం” అని అన్నారు. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులదే అయితే వారిలో 33 శాతం మంది తెలుగువారేనని తెలిపారు. ఈ గణాంకాలు తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటుతాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. “మన ప్రతిభ, మన కృషితో 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలుగు జాతి ప్రాభవం మరింతగా పెరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

“2047 నాటికి మనం జూరిష్ వంటి ప్రపంచ ఆర్థిక రాజధానులను అధిగమించి, గ్లోబల్ లీడర్ గా అవతరిస్తాం” అని ఆయన అన్నారు. తెలుగువారు ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలని, అందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ప్రజలతో కలిసి పని చేయడమే విజయానికి మార్గమని అన్నారు. “ప్రతి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపడమే కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం లేకుండా ముందుకు సాగాలి” అని తెలిపారు. తన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.