Chandrababu: కొడాలి నానిపై చంద్రబాబు పాశుపతాస్త్రం.. గుడివాడ నుంచి బరిలోకి సంచలన అభ్యర్థి !

|

May 05, 2023 | 4:27 PM

రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు.. మరో సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరచబోతున్నారా..? కొరకరాని కొయ్యగా మారిన కొడాలిపై పోటీకి ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపబోతున్నారా...? టీవీ9 ఎక్స్‌క్లూజీవ్ స్టోరీ......

Chandrababu: కొడాలి నానిపై చంద్రబాబు పాశుపతాస్త్రం.. గుడివాడ నుంచి బరిలోకి సంచలన అభ్యర్థి !
Follow us on

గుడివాడ గడ్డ.. కొడాలి నాని అడ్డా. ఇది వైసీపీ కార్యకర్తలు నిత్యం చెప్పే స్లోగన్. 2004, 2009, 2014, 2019.. ఇలా వరసగా నాలుగు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి రెండుసార్లు టీడీపీ నుంచి విజయకేతనం ఎగరవేయగా.. ఆ తర్వాత వైసీపీ నుంచి 2 సార్లు గెలిచారు. జగన్‌కి ప్రస్తుతం అత్యంత నమ్మకస్థుడు కొడాలి. ఒక రకంగా చెప్పాలంటే.. జగన్ నమ్మిన సైనికుడు. అందుకే తొలిసారి మంత్రి వర్గంలో నానికి చోటు కల్పించారు జగన్. వైసీపీపై, అధినేత జగన్ గురించి ఎవరు మాట్లాడినా వారిని చీల్చిచెండాడతాడు నాని. పక్కా నాటు పదాలతో విరుచుకుపడతాడు. టీడీపీ నేతలపై, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చుతాడు. చంద్రబాబును అయితే  డైరెక్ట్‌గా తిట్టేస్తాడు.  వైసీపీ నుంచి ఓ రేంజ్ అగ్రెసివ్ కామెంట్స్ చేసేది నాని మాత్రమే. అంతెందుకు మొన్న చంద్రబాబును పొగిడినందుకు ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కూడా ఏకిపారేశాడు నాని.

అందుకే ఈసారి కొడాలి నానిని ఎలా అయినా ఓడించాలని బాబు వ్యూహాలు పన్నుతున్నారు. కానీ గుడివాడలో నాని ఎదుర్కునేందుకు టీడీపీకి సరైన క్యాండిడేట్ దొరకడం లేదు. వ్యక్తిగతంగా ఉన్న మాస్ ఇమేజ్‌తో పాటు.. నియోజకవర్గంలోని చాలామంది కార్యకర్తలను పేరు పెట్టి పిలిచేంత చనువు నానికి ఉందని స్థానికంగా టాక్. అందుకే ఆయన సీటును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపినప్పటికీ.. చిత్తుగా ఓడించాడు నాని. ఆ తర్వాత అవినాష్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. మరి ఎవరు.. కొరకరాని కొయ్యలా మారి.. టీడీపీపై అణుబాంబులా విరుచుకుపడుతున్న నానికి చెక్ పెట్టేది ఎవరు..? ఇప్పుడు ఇదే ప్రశ్న టీడీపీ శ్రేణులను వేధిస్తుంది. దీంతో చంద్రబాబు తన అనుభవానికి పదునుపెట్టి.. అనూహ్య అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఓ ఫీమేల్ అభ్యర్థిని నానికి పోటీగా నిలబోతున్నారట పసుపు దళం అధిపతి.

ఆమె ఎవరో కాదు దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. అవును.. పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తుంది. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆరాటపడ్డారు తారకరత్న. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇదే విషయాన్ని లోకేశ్ వద్ద కూడా ప్రస్తావించారు. అందుకు తగ్గట్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. పొలిటికల్ ప్రొగ్రామ్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. తన వేషదారణను కూడా అందుకు తగ్గట్టుగా మార్చుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే.. విధి మరోలా తలిచింది. యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున హార్ట్ స్ట్రోక్ రావడంతో కుప్పకూలిన తారకతర్న.. చికిత్స పొందుతూ శివరాత్రి రోజు శివైక్యం చెందారు. తారకరత్న కుటుంబానికి తోడుగా ఉంటామని అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు.. లోకేశ్, బాలయ్య హామి ఇచ్చారు.  ఈ క్రమంలోనే ఆమెను ఈసారి గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు తారకరత్న కుటుంబానికి న్యాయం చేసినట్లుగా ఉంటుంది. సానుభూతి కూడా కలిసివస్తుంది. ఈ లెక్కన ఆడకూతురి ద్వారా కొడాలిని ఓడించినట్లు అవుతుంది. అందుకే చంద్రబాబు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.

Alekhya Reddy with chandrababu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..