Prakasam district: ఆవుల మంద తిరగబడటంతో తోక ముడిచి తుర్రుమన్న పెద్దపులి

ప్రకాశం జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని అర్ధవీడు మండలం దొనకొండ గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. శుక్రవారం అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవులపై పెద్దపులి దాడి చేసినా, మిగతా పశువులు పెద్దపులిపై తిరగబడడంతో అది పారిపోయింది. గాయపడిన ఆవు చావు బతుకు మధ్య ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామస్థులు పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారుల తక్షణ చర్యలను కోరుతున్నారు.

Prakasam district:  ఆవుల మంద తిరగబడటంతో తోక ముడిచి తుర్రుమన్న పెద్దపులి
Cow

Edited By:

Updated on: Jun 20, 2025 | 9:25 PM

అటవీప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల్లోని పశువులపై పులులు అప్పుడప్పుడు దాడులు చేస్తుంటాయి… మందలో ఏదో ఒక పశువుపై దాడి చేసి ఎత్తుకెళ్లి పులులు ఆకలి తీర్చుకుంటుంటాయి… ప్రకాశం జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని సమీప గ్రామాల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి… అయితే ఈసారి సీన్‌ రివర్స్‌ అయింది… అటవీప్రాంత గ్రామంలోకి వచ్చి పశువుల మందపై దాడి చేసిన ఓ పెద్దపులిని ఆవులంతా కలిసి తరిమికొట్టాయి… ఈ పరిణామంతో బిత్తరపోయిన పెద్దపులి కొంతదూరం వెళ్లి నిలుచుండి పోయిందట… తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించినా ఆవులన్నీ ఏకం కావడంతో పరాభవం తప్పదని తెలుసుకుని తోక ముడిచిందని పశువుల కాపర్లు చెబుతుండటం విశేషం.

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం దొనకొండ గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గ్రామానికి దగ్గరగా నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో పెద్దపులి అర్ధవీడు మండలంలో కొద్దిగా రోజులుగా తిరుగుతూ పశువులపై దాడి చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం మేత కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఆవులపై పెద్దపులి దాడి చేసి గాయపరిచింది. మేతకు వెళ్లిన మిగతా పశువులు పెద్దపులిపై తిరగబడడంతో పెద్దపులి అడవిలోకి పారిపోయింది. ఆవు తీవ్రంగా గాయపడటంతో రైతు ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయించాడు. ప్రస్తుతం ఆవు చావు బతుకు మధ్యలో ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు పెద్దపులి సంచారం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా గ్రామానికి దగ్గరగా పెద్దపులి తిరుగుతుండడంతో ఆందోళనగా ఉందని చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, తమ గ్రామాలకు పెద్దపులి ముప్పునుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..