ఏపీ రాజకీయాలంటేనే..కులాల ఈక్వేషన్స్. ఓ పార్టీని అధికారంలోకి తేవాలన్నా.. అధికారంలో ఉన్న పార్టీని కిందకు దించాలన్నా సామాజిక వర్గాల సమీకరణాలే కీలకం. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కుల (సామాజిక వర్గ) రాజకీయాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలో కీలక నేతల చేరికలతో సామాజిక సమీకరణాల్లో వైసీపీ దూకుడు కొనసాగిస్తోంది. మరోవైపు నేతల వలసలతో రేసులో టీడీపీ వెనకబడుతోంది.
ఓ వైపు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. మరోవైపు కీలక నేతల చేరికలతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అఖిల భారత యాదవ సంఘం నేత లాకా వెంగళరావు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్‌ను కలిసిన వెంగళరావు యాదవ్..వైసీపీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు బీదమస్తాన్‌రావుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. యాదవ సామాజిక వర్గానికి ఇప్పటికే అధికంగా సీట్లు కేటాయించారు సీఎం జగన్. ఇప్పుడు ఆ వర్గానికి చెందిన కీలక నేత లాకా వెంగళరావు వైసీపీలో చేరడం ఎన్నికలకు ముందు పార్టీకి మరింత బలాన్ని అందిస్తుందన్న వాదన వినిపిస్తోంది.
చేరికలతో వైసీపీలో జోష్ కొనసాగుతుంటే కీలక నేతల వలసలు టీడీపీని కంగారు పెడుతున్నాయి. తాజాగా టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీసీ సామాజిక వర్గాలను అవమానిస్తున్న చింతమనేని లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం బాధాకరమన్న అశోక్ కుమార్ గౌడ్.. దీనిపై చంద్రబాబుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం తీరుకు నిరసనగా పార్టీలో తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.తన భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు.
మరోవైపు టీడీపీ అధినేత చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు.. పలు సామాజిక వర్గాలను ఆ పార్టీకి దూరం చేస్తున్నాయంటూ ఏపీ రాజకీయాల్లో చర్చజరుగుతోంది. సీఎం జగన్ హయాంలో కిరాణా దుకాణాల్లో కూడా గంజాయి అమ్ముతున్నారంటూ రావులపాలెం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాకీయాల కోసం తమ సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఊరుకోబోమని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు ఆర్యవైశ్యులు. మరి ఈ క్యాస్ట్ పాలిటిక్స్‌లో ఏ పార్టీ పైచేయి సాధించిందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలవరకూ ఆగాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..