Accident: ఎన్నో ప్రమాదాలు చూసింటారు. మరెందరో ఆ ప్రమాదాల్లో చనిపోవడం చూసింటారు. కానీ ఈ ప్రమాదం మరీ దారుణం అనే చెప్పాలి. విధి వైపరిత్యానికి ఇదో మచ్చుతునకగా పేర్కొనాలి. సొంత అన్నదమ్ముల బైక్‌లు ఢీకొనగా.. తమ్ముడు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లాలోని కలసపాడు మండలం కేంద్రం సమీపంలో చోటు చేసుకుంది. రాత్రి 9.30 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడు కు చెందిన మస్తాన్, షేక్ పీరాంబీ దంపతులకు ఇద్దరు కొడుకులు షేక్ షరీఫ్, షేక్ షఫీ ఉన్నారు. పెద్ద కుమారుడు షరీఫ్.. సిద్దుమూర్తిపల్లి సమీపంలో ఉన్న పాలకేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు.
అయితే, షరీఫ్ తన విధులను ముగించుకుని కలసాపడులోని ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో షఫీ.. వ్యక్తిగత పనులపై చెన్నారెడ్డిపల్లెకు బైక్‌పై బయలుదేరాడు. అయితే, ఎదురెదురుగా వస్తున్న వీరిద్దరూ పోరుమామిళ్ల రోడ్డులోని కోతి సమాధి సమీపంలో ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. షఫీ అక్కడికక్కడే మృతి చెందాడు. షరీఫ్‌కు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిక్షీంచిన వైద్యులు.. ప్రమాదం ఏమీ లేదని, స్వల్ప గాయాలే అయ్యాయని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్ఐ రామాంజనేయులు.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: