సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు బౌన్సర్లను పెట్టుకోవడం సాధారణంగా జరుగుతుంది. అదే విధంగా షాపుల ప్రారంభోత్సవాలు, ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్న సమయంలోనూ ఈ మధ్య కాలంలో బౌన్సర్లు కనిపిస్తున్నారు. దేహదారుడ్యంతో బలంగా ఉన్న వ్యక్తులు అభిమానులు వీఐపిలపై పడకుండా జాగ్రత్తగా కాపాలాకాస్తుంటారు. అయితే ఆయుధాలు ధరించడం కాని లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవడంగాని బౌన్సర్లు చేయరు. అయితే గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన చుట్టూనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. బౌన్సర్లు కొత్త విధుల్లో చేరారంటూ ఆ కాలనీ వాసులు చెప్పుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో స్థానిక నేత సిసి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాడు. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ సయ్యద్ సుభానీ తన ఇళ్లు వీధిలో సిసి రోడ్డు వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే కొంతమంది స్థానికులు సిసి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. వీధిలో చాలా చోట్ల రోడ్డు ఆక్రమణలకు గురైందని ముందుగా ఆక్రమణలు తొలగించిన తర్వాతే రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే మెటీరియల్ అంతా సమకూర్చుకున్న సయ్యద్ సుభానీ రోడ్డు వేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు. నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో చేసేదేమీ లేక స్థానికులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో సయ్యద్ సుభానీ ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుండి పంపించి రోడ్డు వేసేందుకు బౌన్సర్లను పలిపించాడు. ఐదుగురు బౌన్సర్లు వచ్చి రోడ్డుపై బైఠాయించిన వారిని అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు గట్టిగా బౌన్సర్లను ప్రతిఘటించారు. దీంతో ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ధి చెప్పి అక్కడ నుండి పంపించేశారు. అయితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి స్థానికులకు బెదిరించేందుకు బౌన్సర్లను రంగంలోకి దించాడన్న సమాచారం గ్రామంలో చర్చనీయాంశమైంది. అసలు బౌన్సర్లు ఇటువంటి పనులకు ఉపయోగించవచ్చా అంటూ స్థానికులు పోలీసులకు ప్రశ్నించారు. బౌన్సర్లను దించి హాడావుడి చేయడంపై స్థానికులు సయ్యద్ సుభానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..