ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 14: రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బోత్స ఝాన్సీ లక్ష్మీ హైకోర్టు న్యాయవాదిగా మారారు. బొత్స రాజకీయ రంగ ప్రవేశం చేసిననాటి నుండి ఆయన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన ఆమె రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. బొత్స ఝాన్సీ ఇప్పటివరకు 2 సార్లు విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా, 2 సార్లు ఎంపిగా కూడా పని చేశారు. ఆమె పొలిటికల్ కెరీర్ గురించి ఓ సారి చూస్తే.. 2006 బొబ్బిలి ఎంపి ఉప ఎన్నికల్లో ఘాన్సీ తొలిసారి ఎంపిగా ఎన్నికయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో కూడా విజయనగరం ఎంపిగా పోటీచేసి భారీ మెజారిటీతో రెండో సారి కూడా ఎంపిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ రాజకీయాల్లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇప్పటికీ యాక్టీవ్ పాలిటిక్స్‌లో బిజీగానే ఉన్నా, ఎప్పుడూతన చదువుకు బ్రేక్ ఇవ్వలేదు. చదువుకు వయస్సు అడ్డు కాదు, కాకూడదని గట్టిగా నమ్మి ఆచరించారు.
రాజకీయాల్లో మహిళ సాధికారిత కోసం ప్రయత్నించిన ఝాన్సీ ఉన్నత విద్యలో కూడా అటు వైపే సాగారు. గతంలోనే ఎమ్ఏ, ఎల్ఎల్‌బి, ఎల్ఎల్ఎమ్ చేసిన ఝాన్సీ ఎంపిగా ఉన్న సమయంలో ఫిలాసఫీలో మహిళ సాధికారితపై పిహెచ్‌డి చేశారు. ఇప్పుడు న్యాయశాస్త్రంలో కూడా పంచాయితీ రాజ్ ద్వారా మహిళ సాధికారిత, సామాజిక న్యాయశాస్త్రంపై పిహెచ్‌డి పూర్తి చేశారు. లా అయిన వెంటనే ప్రాక్టీస్ చేయకుండా పిహెచ్‌డి పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ మెంబర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించి ఒక మహిళగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.