Andhra: ఇవి రోడ్డు పక్కన పడేసిన సుద్ద ముక్కలు అనుకునేరు.. వాటి వెనుక అదృశ్య శక్తులు

విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. జెడ్పీ హైస్కూల్‌కు సమీపంలో ఖాళీ ప్రదేశంలో సుద్ద ముగ్గులు, బొమ్మతో చేసిన పూజ గుర్తులు కనిపించడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పిల్లలు నిత్యం వెళ్లే దారిలోనే ఈ ఘటన జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

Andhra: ఇవి రోడ్డు పక్కన పడేసిన సుద్ద ముక్కలు అనుకునేరు.. వాటి వెనుక అదృశ్య శక్తులు
Black Magic Rituals

Edited By:

Updated on: Dec 22, 2025 | 6:03 PM

విజయనగరం జిల్లా బొండపల్లి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. బొండపల్లి జెడ్పీ హైస్కూల్‌కు కూత వేటు దూరంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొనిచెరవు ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశంలో సుద్దతో ముగ్గులు వేసి, అందులో బొమ్మ పెట్టి పూజ చేసినట్లు స్పష్టమైన గుర్తులు బయటపడటంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది.

ముఖ్యంగా ఈ ప్రాంతం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, హాస్టల్‌లో ఉండే చిన్నారులు నిత్యం వెళ్లి వచ్చే మార్గంలో ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఉదయం పూట స్కూల్‌కు వెళ్లి.. సాయంత్రం వచ్చే దారిలో ఈ సుద్ద ముగ్గులు, పూజా సామగ్రి చూసి పిల్లలు భయంతో బెంబేలెత్తిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. సుద్దతో వేసిన వింత గుర్తులు, ముగ్గుల మధ్యలో ఉంచిన బొమ్మ, చుట్టూ చల్లి వదిలిన వస్తువులు క్షుద్ర పూజలకే సంకేతమని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే రాత్రి వేళల్లో ఈ పూజలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా జరగడం వెనుక దురుద్దేశం ఉందేమోనని స్థానికులు భయపడుతున్నారు. పిల్లలు వెళ్లే దారిలో జరిగిన ఈ క్షుద్రపూజలు ఎవరైనా విద్యార్థికి హాని కలిగించేందుకు జరిపారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై తక్షణమే అధికారులు స్పందించి, ఆ ప్రాంతాన్ని పరిశీలించి, క్షుద్ర పూజల వెనుక ఉన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత దృష్ట్యా ఈ మార్గంలో పోలీస్ గస్తీ పెంచాలని, ఇలాంటి మూఢనమ్మకాల కార్యకలాపాలను అరికట్టాలని కోరుతున్నారు. బొండపల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.