జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన వివాదాస్పదం అయింది. పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకునే సమయంలో ఏపీ మంత్రులపై జనసేన నేతలు దాడి చేశారని ఆరోపణలు చేశారు. అంతేకాదు పలువురు జనసేన నేతలపై కేసులు నమోదు చేసి.. కోర్టుకు తరలించారు విశాఖ పోలీసులు.. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలో ప్రభుత్వం తీరు దారుణం అంటూ ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేయగా.. తాజాగా పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతలు తమ సపోర్ట్ అంటూ మాట్లాడారు. విశాఖలో జరిగిన ఘటనలపై బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పురంధేశ్వరి కూడా ఫోన్లో మాట్లాడారు. విశాఖలో నిన్న, ఈ రోజు జరిగిన ఘటనలు అప్రజాస్వామికంగా ఉన్నాయని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.
అయితే ఇదే విషయంపై నెక్స్ట్ స్టెప్ ఏమీ తీసుకోవాలో అని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. విశాఖ పొలీసులు అక్రమ కేసులు నమోదు చేసి పార్టీ నాయకులతో పాటు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలను అదుపులోకి తీసుకున్న అంశాలపై సమీక్షించారు. అరెస్టయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, స్టేషన్లలో ఉన్నవారికి అవసరం అయిన మెడికల్ ఎయిడ్, ఆహారం సక్రమంగా అందించే బాధ్యతను తీసుకోవాలని నాయకులకి సూచించారు. కేసులు ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన సహాయం అందించే బాధ్యతను పార్టీ చేపట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే విషయంపై సీనియర్ లాయర్లతో చర్చించామని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..