
ఏపీలో పొత్తుల రాజకీయంపై క్రమంగా స్పష్టత వస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా ఇప్పటిదాకా బీజేపీ నిర్ణయంపై స్పష్టత రాలేదు. అయితే తాజాగా నాలుగోదశ వారాహి యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ క్లియర్ పిక్చర్ ఇచ్చారు. బీజేపీ తో కలిసి వెళ్తే ఓట్లు రావచ్చు..అసెంబ్లీకి ఎంతమంది వెళ్తామనే సందేహం ఉందంటూ పొలిటికల్ రచ్చకు తెరతీశారు. ఇంతకాలం ఎన్డీయేలో భాగంగానే ఉంటామని చెప్పిన పవన్… ఇక అవసరం లేదని భావించారా?
అవనిగడ్డలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగమే ఇప్పుడు అధికారపార్టీకి ఆయుధంగా మారింది. తన ప్రసంగంలో పదేపదే టీడీపీ- జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని ప్రకటించారు పవన్.. కానీ బీజేపీ కూడా మిత్రపక్షంగా ఉంటుందని ఎక్కడా చెప్పలేదు జనసేన. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాజమండ్రి తీర్మానం ప్రకారం పొత్తులో భాగంగా బీజేపీని కూడా పొత్తులకు ఒప్పిస్తామన్నారు .. కానీ ఇప్పుడు కేవలం టీడీపీ-జనసేన ప్రభుత్వమే వస్తుందని చెప్పడం ద్వారా పొత్తులపై మరోసారి రచ్చకు కూడా పవనే కారణమయ్యారు. అసలు బీజేపీతో కలిసి వెళితే అసెంబ్లీలో అడుగుపెట్టగలమా అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీని కూడా ఆలోచనలో పడేశాయి.
గతంలో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం ఉందని పవన్ చెప్పేవారు. ఇప్పుడు పొత్తు..అధికారం గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆ ఊసే లేదు. దీని ద్వారా ఇక టీడీపీతో మాత్రమే కొనసాగాలని పవన్ డిసైడ్ అయినట్లు స్పష్టం అవుతోంది. బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని ఇప్పటికీ చెబుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రా కోసం అందరూ కలవాల్సిందే అని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మరో టర్న్ తీసుకున్నారా? లేక టీడీపీతో పొత్తు వద్దని బీజేపీనే చెప్పడం వల్లే మాట మారిందా?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..