ఏపీలో జరిగిన అల్లర్లను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం సిట్‌ను నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ సారథ్యంలో ప్రత్యేక బృందాలు రెండురోజుల పాటు తిరుపతి, పల్నాడు, అనంతపురంలో పర్యటించి కీలక సమాచారం రాబట్టాయి. 150 పేజీలతో ప్రాధమిక నివేదిక సిద్ధం చేసింది సిట్.. ఇప్పటికే అల్లర్ల వ్యవహారంలో 12మంది అధికారులపై వేటు వేసిన ఈసీ.. నలుగురు సివిల్ సర్వీస్ అధికారులపైనా చర్యలకు ఆదేశించింది. దీంతో ఇప్పటికే వారిపై అభియోగాలు నమోదు చేస్తూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఏపీ సీఎస్.
అటు సిట్ యాక్షన్.. ఇటు ఈసీ రియాక్షన్ అలా ఉంచితే పార్టీల మధ్య ఫిర్యాదుల యుద్ధం కొనసాగుతోంది. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే తమకు సన్నిహితంగా ఉండే అధికారులు ఉండేలా చేసుకుని ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేశారంటోంది వైసీపీ. టీడీపీ- బీజేపీ పోలీసులను ఉపయోగించి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారంటూ సిట్ అధికారులను కలిసి మరీ మరోసారి ఫిర్యాదు చేశారు మంత్రులు.
అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేశారంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కౌంటర్ ఇచ్చింది టీడీపీ. అధికారపార్టీయే అల్లర్లకు కారణమని సమగ్ర విచారణతో నిజానిజాలు బయటపెట్టాలంటోంది తెలుగుదేశం.
ఎన్నికల అనంతర హింసపై సిట్ పూర్తి స్తాయి విచారణ చేస్తోంది. మరోవైపు టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీస్తోంది ఎన్నికల సంఘం. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పార్టీల వాదనలతో ఏకీభవించిన ఈసీ ఇప్పటికే కేంద్ర బలగాలను కొనసాగించాలని నిర్ణయించింది. మరి ఇప్పటికే ఇచ్చిన సిట్ ప్రాధమిక నివేదికలో ఎవరి పేర్లు ఉన్నాయి..? కౌంటింగ్ విషయంలో ఏమైనా సూచనలు చేశారా చూడాలి..