Big News Big Debate : ఏపీలో కులతంత్రమే ఇప్పుడు రాజకీయ మంత్రం. అందుకే, మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఆ దిశగా కొత్త వ్యూహాలను రచిస్తోంది. కీలకమైన కాపు, బీసీ సామాజిక వర్గాలే టార్గెట్‌గా ద్విముఖ వ్యూహంతో ముందుకొస్తోంది. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీలను దువ్వే ప్రయత్నం చేసిన సీఎం జగన్… భారీ సంఖ్యలో నామినేటెడ్ పోస్టులను ఆ వర్గం నేతలకు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టిక్కెట్ల కేటాయింపులోనూ బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు వైసీపీ బాస్. ఆ దిశగా ఇప్పటికే ముమ్మరమైన కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో కీలకమైన సామాజికవర్గంగా ఉన్నకాపుల ఆదరణను మిస్సవకుండా ప్లాన్ చేస్తోంది వైసీపీ. అందులో భాగమే తాజాగా వేడి పుట్టిస్తున్న ముద్రగడ ఎపిసోడ్. కాపు ఉద్యమనేతగా ముద్రగడ పద్మనాభం చరిష్మాను వాడుకోవాలనుకుంటున్న అధికార పార్టీ… ఆయనకు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి మరింత చేరువకావాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే, మరికొన్ని రోజుల్లో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ లెక్కన ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనని తెలుస్తోంది. ఇదే సమయంలో వంగవీటి రాధాకు సైతం.. వెల్‌కమ్ అంటోంది వైసీపీ.
పద్మనాభం ఎన్నికలబరిలో ఉంటారా? లేదా? అనేవిషయమై … ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన వెలువడొచ్చన్న ప్రచారం జరుగుతున్నవేళ.. ఇప్పటికే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి అభిమానుల తాకిడి ఎక్కువైంది. అయితే ముద్రగడ, తన కుమారుడు చల్లారావుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బట్, ఏ నిర్ణయమైనా నాన్న చెప్పిందే ఫైనల్ అంటున్నాడు.. చల్లారావు సన్నాఫ్ ముద్రగడ పద్మనాభం.
కాపు రిజర్వేషన్ల కోసం గత టీడీపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడిన పద్మనాభం.. ఇప్పుడు వైసీపీలో చేరితే ఏపీ రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీతో-జనసేన కూటమికి కొంత ఇబ్బందిక పరిస్థితులూ ఎదురుకావొచ్చు. కాపులు తమకు మరో ప్రతినిధిగా భావిస్తున్న పవన్‌కు.. సొంత సామాజిక వర్గంతో పోరు తప్పకపోవచ్చు. ఎందుకంటే,ముద్రగడ, పవన్ కల్యాణ్ మధ్య.. కాపులు చీలిపోయే అవకాశం ఉంది. మరి, బీసీమంత్రం.. కాపు తంత్రంతో ముందుకొస్తున్న వైసీపీకి మున్ముందు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..