
ఉత్తరాంధ్ర కలల ప్రాజెక్ట్ సాకారానికి మరింత చేరువైంది. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండైంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై ల్యాండ్ అయింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్‌వేని రూపొందించారు. ఇది శుభసంకేమతమని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇదిలాఉంటే.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ మధ్య క్రెడిట్ వార్ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది.
భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్‌పై ట్వీట్ చేసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందన్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించామన్నారు. పునరావాసం, భూసేకరణకు రూ.960 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రధాన పనుల్లో ఎక్కువ భాగం అప్పుడే పూర్తయ్యిందని.. తాము చేసిన కృషి ఈ కీలక మైలురాయికి ముఖ్య కారణమని కామెంట్ చేశారు. వైసీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగంగా సాగాయన్నారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ.
మరోవైపు తొలి వాలిడేషన్ విమానం ల్యాండింగ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్ర విమానయాన రంగంలో ఇదో కీలక మైలురాయి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర ఇప్పుడు టేకాఫ్‌కు సిద్ధమన్నారు. 2014 – 2019 మధ్య కాలంలో ఈ విమానాశ్రాయ నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పనులు 96 శాతం పూర్తి అయినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..