Watch Video: మీరు ఒక్కసారి ఈ స్టేషన్‌కు వెళ్తే.. తిరిగి రమ్మన్నారారు.. ఎందుకో తెలుసా?

తుపాకులు, లాఠీలు, ఖాకీ డ్రస్‌లతో పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు గంభీరంగా కనిపిస్తుంటాయి.. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలంటే సామాన్యులు భయపడుతుంటారు. పోలీసులు కూడా తరచూ నేరాలు, ఘోరాలు చూసి విగిసిపోయుంటారు.. వీటి వల్ల కొన్ని సార్లు ఒత్తిడికి కూడా లోనవుతుంటారు. ఇలాంటి వాతావరణం ఒక్కసారిగా పక్షుల కిలకిలతో, ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా మారిపోతే ఎలా ఉంటుంది. అప్పటి వరకు ఉన్న అన్ని నెషన్స్ పోయి మనసు ఆహాయిగా అనిపిస్తుంది కదా.. అచ్చం అదే ఆలోచన చేశారు ఇక్కడి పోలీసులు.

Watch Video: మీరు ఒక్కసారి ఈ స్టేషన్‌కు వెళ్తే.. తిరిగి రమ్మన్నారారు.. ఎందుకో తెలుసా?
Ap News

Edited By:

Updated on: Dec 22, 2025 | 10:11 PM

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం పోలీసులు తమ పోలీస్ స్టేషన్‌ను మినీ పార్క్‌లా తీర్చి దిద్దారు. స్టేషన్‌ ఆవరణలో పచ్చని పరిసరాలు.. కుందేళ్లు, పక్షుల కిలకిలారావాలతో స్టేషన్ ప్రాంగణం మొత్తాన్ని ఆహ్లాదకరంగా మార్చేశారు. ప్రస్తుతం ఇక్కడ వందకి పైగా కుందేళ్ళు, పావురాలు, హంసలను తలపించే తెల్లబాతులు, గిన్నెకోళ్ళు ఉన్నాయి. ఇవి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతున్నాయి. సమస్యలతో ఇక్కడికి వచ్చే వారు కూడా ఇక్కడే కాసేపు గడిపి.. మనస్సును శాంతపర్చుకొని వెళ్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

2014లో పడిన అడుగులు

యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌ నల్లమల అటవీప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ 2014లో ఎస్‌ఐగా పనిచేసిన మాతంగి శ్రీనివాసరావు పక్షి ప్రేమికుడు కావడంతో అటవీ వాతావరణంలో పోలీస్ స్టేషన్‌లోనే చిన్న పార్క్‌ ఏర్పాటు చేయాలని భావించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి వివిధ రకాల పక్షిజాతులను తెప్పించారు.స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందిస్తూనే, మొక్కలు మధ్యలో పక్షులు, కుందేళ్ళ కోసం ఓ షెడ్డు, బాతుల కోసం చిన్నపాటి స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు సైతం దీన్ని అలాగే కంటిన్యూ చేశారు. దీంతో తొలుత కొద్దిసంఖ్యలో ఉన్న కుందేళ్ళు, పక్షుల సంతతి నానాటికి పెరిగి ఇప్పుడు యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ ఓ ” చిడియా ఘర్‌ ” అన్నట్టుగా మారిపోయింది.

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సిబ్బంది.

స్టేషన్ సిబ్బంది అక్కడున్న పక్షులు, జంతువులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పక్షులు, జంతువుల సంరక్షణ కోసం కొంత సమయం వెచ్చిస్తామని ప్రస్తుతం ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న చౌడయ్య చెబుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వీటికి ఎవరో ఒకరు ఆహారం అందచేస్తున్నామని.. వీటి సంరక్షణ బాధ్యతను ఓ హోంగార్డుకు అప్పగించినట్టు తెలిపారు. కూరగాయల మార్కెట్ నుంచి ప్రత్యేకంగా క్యాబేజీ, కూరగాయాలు, ఆకుకూరలు తెప్పించి వీటికి ఆహారంగా పెడుతున్నారు. పక్షులకు గింజలను అందుబాటులో ఉంచుతూ.. వాటి నిర్వహణ బాధ్యతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఉన్నతాధికారులు సైతం వీటిని చూసి సిబ్బంది ప్రయత్నాన్ని అభినందించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.