
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రకంగా వరిస్తుందో చెప్పలేం.. తాజాగా ఆలాంటి సంఘటనే జరిగింది ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న కొందరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 98 బ్యాచ్ డి ఎస్ సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్ణయించారు. అయితే ఆనాడు డీఎస్సీ రాసిన ఓ వ్యక్తికి 24 ఏళ్ల తర్వాత ఉద్యోగ విరమణ వయసులో ప్రభుత్వ ఉద్యోగం రావడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు చేనేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుంచి చదవుంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే బిఈడీ పూర్తి చేశారు. టీచర్ కావాలనేది ఆయన కోరిక. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. 1998లో డీఎస్పీ రాసినా వివాదాలతో నిలిచిపోయింది. దీంతో ఉద్యోగం రాదని భావించిన ఆయన సైకిల్‌పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు. అదీ కలిసి రాలేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో చనిపోయారు. తోబుట్టువులు ఇద్దరు ఉన్నా కేదారేశ్వ రరావు మానసిక స్థితిని చూసి విడిచిపెట్టారు. ప్రస్తుతం భిక్షా టన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి డీఎస్సీ- 1998 క్వాలిపై జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు 55 సంవత్సరాలు. ఉద్యోగం జీవితకాలం లేటంటూ ఆయన నిట్టూర్చాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.