అమరావతి, సెప్టెంబర్ 1: బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు పెట్టి రుణాలు పొందే వారి సంఖ్య అధికమయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాలను బ్యాంక్ లు అందిస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు, కౌలు రైతులు తమ బంగారు ఆభరణాలను బ్యాంక్ లో తనఖా పెట్టి రుణాలు పొందుతున్నారు. బ్యాంక్ ల్లో వడ్డీ రేటు కూడా తక్కువుగా ఉండటంతో వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఈ రుణాలు పొందే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
అయితే పల్నాడు జిల్లాలో వరుస వెంట వెలుగు చూస్తున్న ఘటనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగారు ఆభరణాలు బ్యాంక్ ల్లో తనఖా పెట్టే సమయంలో బ్యాంక్ సిబ్బందితో పాటు బ్యాంక్ నియమించుకున్న అప్రైజర్ కూడా ఒకరు ఉంటారు. అప్రైజర్ బంగారు ఆభరణాల నాణ్యతను చెక్ చేసి ఎంత రుణం మంజూరు చేయవచ్చో బ్యాంక్ సిబ్బందికి సలహా ఇస్తారు. సిబ్బంది బ్యాంక్ నిబంధనల ప్రకారం రుణం మంజూరు చేస్తారు.
అయితే అప్రైజర్ లు మోసానికి పాల్పడుతున్న ఘటనలు వరుస వెంట బయటకు వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల యూనియన్ బ్యాంక్ లో రైతులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలను వెంటనే ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. పంట సమయంలో ఆభరణాలు బ్యాంక్ లో పెట్టి రుణాలు పొందిన రైతులు ఆ తర్వాత రుణం మొత్తాన్ని చెల్లించి తమ ఆభరణాలు తనకి ఇవ్వాలని అడిగారు. అయితే బ్యాంక్ లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో రైతులను తర్వాత రావాలంటూ బ్యాంక్ సిబ్బంది చెప్పారు. మూడు నాలుగు వారాల పాటు రైతులు బ్యాంక్ చుట్టూ తిరిగిన ఫలితం లేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు.
ఈ ఘటన జరిగి రెండు నెలలు కూడా మరువక ముందే క్రోసూరు మండలం దోడ్లేరు చైతన్య గోదావరి బ్యాంక్ లో కూడా బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. దీంతో మహిళలు బ్యాంక్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. తమ ఆభరణాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు యడ్లపాడులోని యూనియన్ బ్యాంక్ లో కూడా బంగారు ఆభరణలు మాయం అయ్యాయి. మూడు వందల నాలుగు గ్రాముల ఆభరణాలు కనిపించడం లేదంటూ ఆడిటింగ్ టీమ్ తేల్చింది.
ఈ మూడు చోట్ల కూడా బంగారు ఆభరణాలు మాయం వెనుక అప్రైజర్ల చేతివాటం ఉంది. నకిలీ ఆభరణాలను బినామీ పేర్లతో రుణాలు పొందిన అప్రైజర్లు అసలు విషయం వెలుగు చూసే సరికి బ్యాంక్ నుండే కాదు ఆ ఊరు నుండి కూడా జారుకుంటున్నారు. దీంతో రైతులు, మహిళలు తాము పెట్టిన ఆభరణాలను ఎవరిని అడగాలో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అప్రైజర్ పర్మినెంట్ ఉద్యోగి కాకపోవటంతో ఏ విధంగా మాయం అయిన ఆభరణాలను వసూలు చేయాలో బ్యాంక్ ఉన్నతాధికారులకు అర్ధం కావటం లేదు. మేనేజర్ చేత పోలీసు కేసు పెట్టించి చేతులు దులుపుకుంటున్నారు.
అయితే ఈ మోసాలు ఇదే విధంగా కొనసాగితే గ్రామీణ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా నమ్మకం సడిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకొని ఖాతాదారుల్లో భరోసా నింపాల్సిన అవసరం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.