
ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఎలాగూ మిత్రులుగానే ఉంటారు. వేర్వేరు పార్టీల్లోకి వెళ్లాకనే ఆటోమేటిక్‌గా ప్రత్యర్ధులవుతారు. ఒక్కోసారి రాజకీయ శత్రువులుగానూ మిగులుతారు. ఎన్ని చూల్లేదు అలాంటి దాఖలాలు. కాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అలాంటి ఛాయ కూడా కనిపించలేదు ఇప్పటిదాకా. ఇటువైపు నుంచి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారో.. అట్నుంచి కూడా అంతే పొదుపైన మాటలు వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షాలు ఎన్నెన్ని విమర్శలు చేస్తున్నా.. తమ మధ్య క్లాష్ మాత్రం రానివ్వడం లేదు ఈ ఇద్దరు. మెచ్చుకోవాలి ఆ విషయంలో. ద్వేషం రగుల్చుకుంటే వచ్చేదేం లేదు. స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చిపుచ్చుకుంటే పోయేదీ ఏమీ లేదు. కాకపోతే… రెండు రాష్ట్రాలకూ ప్రతిష్టాత్మకం, సెంటిమెంట్ అయిన నీళ్ల విషయంలో ఇలాగే ఉండగలరా చివరిదాకా. ఇదే అనుమానం కలుగుతోంది చాలామందికి. ఎందుకంటే.. ఆ ప్రాజెక్ట్ చేపట్టనే వద్దు అని ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చెప్పేస్తోంది తెలంగాణ సర్కార్. ఆ ప్రాజెక్ట్‌ను ఆపేదే లేదని అంతే కచ్చితంగా చెప్పేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఒకవిధంగా చూస్తే దీన్ని ‘రెండు రాష్ట్రాల మధ్య క్లాష్’ అనే అనాలి. కాని.. ముఖ్యమంత్రుల మాటలు మాత్రం రాష్ట్రాల స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. బట్.. స్వాతంత్ర దినోత్సవ వేళ చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తున్నారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగనప్పుడు ఎందుకని అడ్డుకోవాలనేది చంద్రబాబు చేస్తున్న వాదన. ఆ ప్రాజెక్ట్‌పై ఎగువనున్న ఏ రాష్ట్రమూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదనేది...