Baby Shower Programme: ఖాకీలంటే వామ్మో అంటూ జంకుతుంటారు.. పోలీసు జీబు కనపడినా, సైరన్ వినిపించినా.. రోడ్లమీదకు వచ్చిన వారు కాస్త వణుకుతూ అక్కడి నుంచి వెళతారు. ఎందుకో ఏమో కానీ.. పోలీసుస్టేషన్లో పని చేసే వారి పట్ల చాలా మంది తెలిసి తెలియక వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటారు. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి. ఎక్కడ చూసినా ఫ్రేండ్లీ పోలీసింగ్ కనిపిస్తుండటంతో అందరూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడకుండా స్టేషన్‌కు వస్తున్నారు. వాస్తవానికి పోలీసులు న్యాయం, ధర్మం, చట్టం ప్రకారం విధులు నిర్వహిస్తూ ఎవరి పక్షపాతం లేకుండా కనిపిస్తారు. ఈ క్రమంలో వారు చేసే పనులు కొన్ని సందర్బంలో అందరి మన్ననలు పొందితే మరికొన్ని సార్లు విమర్శలకు దారితీస్తుంటాయి. అయితే పశ్చిమ గోదావరి (west godavari) జిల్లా పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలోని ఇరగవరం (Iragavaram police station) పోలీసులు ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఇరగవరం మండల పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసులు, సచివాలయాల్లోని మహిళా పోలీసులతో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయంలో పనిచేసే అలేఖ్య అనే మహిళా పోలీసుకు సీమంతం సైతం నిర్వహించారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా కనిపించే ఈ ప్రాంగణంలో ఒక్కసారిగా సందడి కనిపించడంతో అటు వెళ్లే వాళ్లంతా ఒక్కసారి ఆగి జరుగుతున్న కార్యక్రమాన్ని చూసి ఆనందం వ్యక్తంచేశారు. పోలీస్ మహిళలకు సన్మానం, సీమంత కార్యక్రమం చూసి అందరూ మండల పోలీసులను అభినందించారు.
మహిళలను ఇంట్లో వాళ్లు గుర్తించటం, గౌరవించటం ఎంత ముఖ్యమో.. అలానే విధి నిర్వహణలో పనిచేసే వారికి చేదోడువాదోడుగా నిలవడం అంతే ముఖ్యమని ఇరగవరం పోలీసులు తెలిపారు. పనిచేసే చోట ఉండే వ్యక్తలు సోదరభావంతో అండగా నిలబడితే మహిళలు ఇంకా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఇదే స్ఫూర్తి ఇరగవరం పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో కనిపించింది. ఈ సందర్బంగా పలువురు పెనుగొండ సర్కిల్ సి.ఐ నాగేశ్వరరావు, ఇరగవరం యస్.ఐ జనా సతీష్ ను అభినందించారు.
-బి. రవి కుమార్, టీవీ 9 తెలుగు రిపోర్టర్, పశ్చిమ గోదావరి జిల్లా
Also Read: