ఏలూరు, ఆగస్ట్ 21: ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఎక్కడ చూసినా జోరుగా శుభకార్యాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసానికి ముందు మూడు నెలలు వివాహాలకు మంచి ముహూర్తాలు లేవు. దీంతో తమ ఇంట్లోని శుభకార్యాలు నిలుపుదల చేసుకున్న వారు ఈమాసంలో తగ్గేదే లేదంటూ పెళ్లి సందడిలో మునుగి తేలుతున్నారు. శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అందులో మంచి ముహూర్తాలు ఉండడంతో ఆ ముహూర్తంలోనే పెళ్లి చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు నవవధూవరులు. అందుకు తగ్గట్టుగా వివాహాలు జరిపించే పురోహితులు, కళ్యాణ మండపాలు, షామియానా, మండపాల డెకరేషన్ ఇలా ఏ ఒక్కరు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఈనెల 22న గురువారం మంచి ముహూర్తం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది జంటలు ఒకటయ్యేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ అనే మాట వినిపిస్తుంది. ఆగస్ట్ 22వ తేదీన ఉన్న ముహూర్తం కోసం నెలల ముందే పండితులకు, కళ్యాణ మండపాలకు, హోటల్ రూములకు అడ్వాన్సులు చెల్లించడంతో ప్రస్తుతం ఏ ఒక్కటి కూడా ఖాళీ లేదు. ఆగస్ట్ 18న కూడా మంచి ముహూర్తం ఉండడంతో ద్వారకాతిరుమలలో సుమారు వందలకుపైగా శుభకార్యాలు జరిగాయి. అలాగే ఆగస్ట్ 22న కూడా అంతకుమించి వివాహాలు జరుగుతాయని పురోహితులు చెబుతున్నారు. ఆగస్ట్ 22, గురువారం రాత్రి 10: 30 ని.లకు, తెల్లవారుజామున గం 2.47 ని.లకు, 3:43 ని.కు. ముహూర్తాలు బలమైనవిగా పండితులు వెల్లడించారు.
దీంతో చిన్న వెంకన్న దేవస్థానంలో కళ్యాణ మండపాలు, వసతి గదులు, 40 కళ్యాణ మండపాలు అదేవిధంగా ద్వారకా తిరుమలలో ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు, లాడ్జిలు కాళీ లేకుండా బుకింగ్ అయ్యాయి. ఆగస్ట్ 22 పేరు చెబితే అమ్మో హౌస్ ఫుల్ అనే విధంగా పరిస్థితి మారిపోయింది. దీంతోపాటు వివాహాలు జరిపించే పురిహితులకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. మండపాల డెకరేషన్ చేసేవారు సైతం క్షణం తీరిక లేకుండా వారి పనులలో బిజీ అయిపోయారు. అలాగే వివాహానికి కావాల్సిన భాజా భజంత్రీలు కూడా ఎక్కడా ఖాళీ లేకుండా పోయాయి. అయినా సరే ఎక్కడ తగ్గేది లేదనే విధంగా వివాహాలు జరిపించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..