తూర్పుగోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి గ్రామంలో నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు పలు గ్రామాల ప్రజలు. గుమ్మళ్లదొడ్డిలో నిర్మించిన అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గోకవరం మండలంలోని అచ్యుతపురం, గుమ్మళ్లదొడ్డి, బావోజీపేట, వెదురుపాక గ్రామాల ప్రజలు దీక్షలు చేపట్టారు. పాఠంశెట్టి సూర్యచంద్రం దంపతులు, జగ్గంపేట కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మరోతి శివగణేష్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గుమ్మళ్లదొడ్డి గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా.. నాల్గవ రోజు దీక్షకు నాలుగు గ్రామాల నుంచి మహిళలు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ, వాసనతో ఊపిరి ఆడడంలేదని.. ఆరోగ్యానికి హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ తమకొద్దని స్పష్టం చేశారు. అస్సాగో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లో మూసివేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. గుమ్మళ్లదొడ్డిలో పెద్దయెత్తున మొహరించారు. దాంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేస్తారేమోననే భయంతో స్థానిక రామాలయంలోకి వెళ్లారు ఆందోళనకారులు. అయితే.. పోలీసులు ఆలయంలోకి వెళ్లి దీక్ష చేస్తున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. భారీగా చేరుకున్న స్థానికులు.. పోలీసులను బయటకు పంపి మరీ ఆలయం లోపల తాళం వేసుకున్నారు. అదే సమయంలో.. కొందరు గ్రామస్తులు.. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే.. నాలుగు గ్రామాల ప్రజలతో పోలీసు ఉన్నతాధికారులు సైతం చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగారు. అస్సాగో ఫ్యాక్టరీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నాలుగు గ్రామాల ప్రజలు చెప్పారన్నారు. ఫ్యాక్టరీని మూసివేయాలనే డిమాండ్‌తో సంతకాలు చేసి స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.
గాంధేయమార్గంలో మాత్రమే ఆందోళన చేస్తున్నట్లు నాలుగు గ్రామాల ప్రజలు వెల్లడించారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. ఫ్యాక్టరీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు పోలీసు ఉన్నతాధికారులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..