ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.ఇప్పటికే గత నెలలో ఒకసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధుల బృందం రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేసింది. ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఓటర్ జాబితాలో అక్రమాలు లేకుండా పారదర్శకంగా రూపొందించాలని తెలిపారు. నకిలీ మద్యం, నగదు అక్రమ రవాణా, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని అవసరమైన చోట చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లాల వారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన వసతులపైనా పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డితోనూ భేటీ అయ్యారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతోనూ సమావేశమై ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
డిసెంబర్‌లో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో కీలక ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు. తాజాగా మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఈసీఐ అధికారులు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో విజయవాడ వచ్చిన అధికారుల బృందం రెండు రోజులపాటు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. మొదటి రోజు రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. టీడీపీ-జనసేనతో పాటు వైఎస్సార్సీపీ పోటాపోటీ ఫిర్యాదులు చేశారు.
విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రెండు రోజులపాటు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌తో పాటు ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ సమావేశమయ్యారు. టీడీపీ-జనసేన నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఈసీ ని కలిసి ఫిర్యాదు చేశారు. అటు అధికార వైఎస్సార్సీపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరు అంశాలపై ఈసీకి నివేదిక ఇచ్చారు వైసీఒఈ నేతలు. జనసేన పార్టీకి గుర్తింపు లేకపోయినా ఎందుకు ఆహ్వానించారాని ఎన్నికల సంఘం ప్రతినిధులను వైసీపీ నేతలు అడిగారు.
పొత్తులో భాగంగా టీడీపీ తమను అడిగిందని అందుకే ఒప్పుకున్నట్లు ఈసీఐ అధికారులు చెప్పారు గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు అని…సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాలలో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అనే అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు గుర్తింపు లేని పార్టీకి వరుసగా రెండుసార్లు ఒకే గుర్తు కేటాయించకూడదని చట్టంలో ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు…తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరపాలని. దీని ద్వారా రెండు చోట్ల ఓటు వేయడాన్ని నియబత్రించవచ్చని కోరారు. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులపై చర్యలు తీసుకుంటానని బెదిరించడం పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. టీడీపీకి చెందిన కోనేరు సురేష్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు..కర్నూల్ జిల్లా లో 67వేల370 బోగస్ ఓట్లు ఉన్నాయని. ఇతర జిల్లాలలో వేల కొద్దీ బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసి ఈసీని తప్పుదోవ పట్టించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ వెరిఫికేషన్ అనంతరం చాలా వరకు సరైన ఓటర్లు ఉన్నారని గుర్తించారు. తప్పు దోవ పట్టించినవారిపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు ఇచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను టీడీపీ-జనసేన అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కలిశారు. జనసేన పార్టీకి గుర్తింపు లేకపోవడం తో టీడీపీ రిక్వెస్ట్ మేరకు పొత్తులో భాగంగా అనుమతి ఇచ్చారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు ఇరుపార్టీల అధినేతలు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల విధులకు అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకోవాలని, ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచవద్దని ఈసీని కోరారు.
గతంలో బీఎల్ఓలుగా సీనియర్ అధికారులు ఉండేవారని ప్రస్తుతం 2600 మంది మహిళా పోలీసులను పెట్టారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీచర్లను ఎన్నికల విధులకు ఉపయోగించేలా చూడాలని ఈసీని కోరారు చంద్రబాబు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపాలన్నారు టీడీపీ అధినేత. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రగిరి, పర్చూరులో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి ఆయా పార్టీల ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..