Aqua Farms: ఆక్వా రంగంపై అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అప్పుల ఊబిలోకి రొయ్యల రైతులు
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి.. భారీ వర్షాలు, భీకర ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తం కాగా.. ఇప్పుడు ఆక్వా రైతులనూ కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ స్తంభాలు నేలకూలి, సరఫరా నిలిచిపోవడంతో రొయ్యల చెరువుల్లో ప్రాణవాయువు అందక పరిస్థితి దారుణంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పెంచిన రొయ్యలు కళ్ల ముందే మృత్యువాత పడుతుండటంతో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

ప్రకృతి మరోసారి అన్నదాతపై తన ప్రతాపాన్ని చూపింది. ‘అర్నాబ్’ తుఫాను ధాటికి ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఆక్వా రంగం సర్వనాశనమై, ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, భీకర ఈదురుగాలులు ఒకెత్తయితే.. మూడు రోజులుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. కరెంట్ లేక చెరువుల్లో ప్రాణవాయువు అడుగంటడంతో, వేలాది రూపాయలు వెచ్చించి పెంచిన రొయ్యలు విలవిల్లాడుతూ మృత్యువాత పడుతున్నాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో రొయ్యల ప్రాణాలు కాపాడుకునేందుకు రైతులు గత్యంతరం లేక అప్పులపాలవుతూ భారీ ఖర్చుతో జనరేటర్ల బాట పట్టారు. ఐదెకరాల చెరువుకు నడిచే పెద్ద జనరేటర్ అద్దె రోజుకు రూ.30 నుంచి రూ.40 వేలకు ఎగబాకగా.. గంటకు 15 లీటర్ల డీజిల్ చొప్పున కేవలం ఇంధనం కోసమే వేల రూపాయలు తగలేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రకృతి సృష్టించిన ఈ విలయాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారడం రైతుల కష్టాలను మరింత పెంచుతోంది.
తుఫాను ప్రభావంతో ఐస్ ఫ్యాక్టరీలు మూతపడడం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడాన్ని అదనుగా భావించి కిలో రొయ్యలపై ఏకంగా రూ.40 నుంచి రూ.60 వరకు అడ్డగోలుగా ధర తగ్గించేశారు. దీనికి తోడు బంగాళాఖాతంలో మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందన్న ప్రచారంతో బెంబేలెత్తిపోతున్న రైతులు.. సరుకును నిల్వ ఉంచే పరిస్థితి లేక కన్నతల్లి రుణంలాంటి పంటను కన్నీళ్లతో తక్కువ ధరకే కట్టబెట్టాల్సిన దయనీయ స్థితికి నెట్టబడ్డారు. కనీసం 5 టన్నుల సరుకు ఉంటేనే ధర ఇస్తామని, అంతకంటే తక్కువ ఉంటే కిలో కేవలం రూ.220 చొప్పునే కొనుగోలు చేస్తూ వ్యాపారులు రైతుల కష్టాలను నిలువునా దోచుకుంటున్నారని ఏపీ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాలుల తీవ్రతకు చెట్ల కొమ్మలు విరిగిపడి చెరువుల గట్లపై ఉన్న విద్యుత్ షెడ్లు నేలకూలగా, భారీ వర్షాల కారణంగా నీటి ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోయి రొయ్యల పట్టబడులు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పాలకొల్లు, నరసాపురం, ఉండి తదితర ప్రాంతాల్లో ఆక్వా రైతులతో పాటు వరి సాగుదారులు కూడా అపార నష్టాలను చవిచూశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఐస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రైతులకు ఐస్‌ను, అవసరమైన రవాణా సౌకర్యాలను ఉచితంగా లేదా రాయితీపై అందించి ఆదుకోవాలని ఆక్వా సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
చెరువులకు అదనంగా పడుతున్న విద్యుత్ భారాన్ని, డీజిల్ ఖర్చులను తగ్గించే దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. సిండికేట్ వ్యాపారుల అరాచకాలను కట్టడి చేసి గిట్టుబాటు ధర కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల ఆక్వా రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
