ఒకే టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా దూర ప్రాంతాలకు పయనమైనవారు బస్సు మారాలంటే ఏదైనా పెద్ద బస్టాండ్‌కి వెళ్లి, అక్కడ నుంచి మరో బస్ మారవలసి వచ్చేది. అలా బస్సు మారిన ప్రతి సారి టికెట్ తీసుకునేవారు. అయితే ఇప్పుడు అంత కష్టం అవసరం లేదు. ఆర్‌టీసీ తాజాగా తీసుకున్న ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ నిర్ణయంతో వెళ్లాల్సిన ప్రాంతానికి నేరుగా బస్సు సదుపాయం లేనప్పుడు, ఒక టికెట్‌తో రెండు బస్సుల్లో ప్రయా ణం చేసి గమ్యస్థానం చేరుకునే అవకాశం లభించింది. ఇంకా మార్గమధ్యంలో ఏదైనా మెయిన్ బస్టాండ్‌లో దిగి అక్కడ మరో బస్సు ఎక్కి కూడా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
ఉదాహరణకు విజయవాడ నుంచి నేరుగా చీరాల వెళ్లాలంటే బస్సు లేదు. కానీ విజయవాడ నుంచి గుంటూరు, అక్కడ నుంచి చీరాల వెళ్లేందుకు అవకావం ఉంది. ఇలా రెండు సార్లు బస్ మారినా.. తాజాగా వచ్చిన ‘మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్’ ద్వారా విజయవాడలోనే చీరాలకు వెళ్లేందుకు కావలసిన టికెట్ తీసుకోవచ్చు. పైగా విజయవాడలో ఒక సారి, గుంటూరులో మరోసారి టికెట్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. ఇక ఆర్టీసీ తెచ్చిన ఈ నూతన విధానంతో 2 సార్లు చెల్లించవలసిన రిజర్వేషన్ చార్జీలను ఒక్క సారి చెల్లిస్తే చాలు.
అలాగే ఒక చోట నుంచి బయలు దేరి, రెండో చోట బస్ మారాలనుకునే ప్రయాణికులకు 2 నుంచి 22 గంటల గడువు ఉంటుంది. తద్వారా ఆ గడువు సమయాల్లో ఉన్న బస్సు సర్వీసులను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానాన్ని తొలి విడతగా అమలుచేయనుంది ఆర్టీసీ. ప్రయాణికుల స్పందనను బట్టి మిగిలిన రూట్లలో కూడా ఈ ‘జర్నీ రిజర్వేషన్’ విధానాన్ని విస్తరిస్తారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా లేదా ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ రిజర్వేషన్లు చేసుకునేందుకు వీలుంది. విశేషమేమిటంటే.. దేశంలోని ప్రభుత్వ రంగ ఆర్టీసీల్లో మన రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధానం అమలులోకి రాబోతుంది. ఇక ఈ సదుపాయం రెండు, మూడు రోజు్లో అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..