కర్నూలు, మార్చి 1: ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోటీ పరీక్షలు కూడా నిర్వహించింది. ఫిబ్రవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 పరీక్ష ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 24 జిల్లాల్లో దాదాపు 1327 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. కాగా ఈ పరీక్ష రోజున కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదోనిలోని భాష్యం విద్యాసంస్థలో 6వ నెంబర్ గదికి ఇన్విజిలేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ప్రశ్నపత్రాలను సీల్డ్ కవర్‌లో కాకుండా నేరుగా గదిలోకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆ గదిలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్ధులు దీనిపై అభ్యంతరాలు తెలిపారు.
ప్రశ్నపత్రాల కవర్లను పరీక్షకు ముందే ఇన్విజిలేటర్లకు ఇచ్చిన గదిలోనే తెరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రశ్నపత్రానికి ఉండాల్సిన స్టిక్కర్ సీల్ కూడా లేదని గమనించిన అభ్యర్థులు ఇదే విషయమై ఇన్విజిలేటర్‌ను ప్రశ్నించారు. ముందుగానే సీల్ ఊడిపోయి ఉందని ఇన్విజిలేటర్ చెప్పినట్లు సమాచారం. పరీక్ష ముగిసిన తర్వాత ఆ గదిలో పరీక్ష రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని అదేరోజు పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయం బయటికి రావడంతో పలుఅనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే ఈ సారి గరిష్టంగా అభ్యర్ధులు గ్రూప్ 2 పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 897 పోస్టులకు గానూ ఎపీపీఎస్సీ గ్రూప్ 2 నియామక ప్రక్రియ చేపడుతోంది. ఎన్నో ఆశలతో గ్రూప్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కర్నూలులోని తాజా సంఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.