
కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి అంటూ గుంటూరు కలెక్టర్ స్పందన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు హరికిషన్ వాపోయాడు. తనకి రావాల్సిన 11 లక్షల రూపాయల బకాయిలు ఇప్పించాలని కలెక్టర్ కు పెట్టుకున్న దరఖాస్తులో విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ తనకు రావాల్సిన బకాయి డబ్బులు రాకపోతే.. మరణమే శరణ్యమంటూ కన్నీరు మున్నీరుగా కలెక్టరేట్ దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశాడు.
తన సమస్యను పరిష్కరించాలని ఎన్నోసార్లు మంత్రి కార్యాలయం నుంచి హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్‌కు ఫోన్లు చేయించినా కూడా ఆయన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిధులు మంజూరు కోసం రాజమండ్రి కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా కలెక్టర్ ఆదేశాలను కమిషనర్ బేఖాతరు చేశారని వాపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే
వ్యవసాయ శాఖలో ఎలక్ట్రికల్ ఆటోల అవసరం ఉంటుంది. అయితే వీటిని హార్టికల్చర్ శాఖ సమకూరుస్తుంది. దీనిలో భాగంగా.. వ్యవసాయ శాఖకు మూడు ఎలక్ట్రికల్ ఆటోలను సప్లై చేశానని చెప్పాడు హరికిషన్. దీనికింద 11 లక్షల రూపాయల బకాయి నిధులు రావాల్సి ఉన్నాయన్నారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం