మండు వేసవిలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. అది కూడా రెయిన్ సీజన్‌ను తలపించేలా.. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ (మే2) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కాగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద అసలు ఉండవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది.
కాగా ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారీ వర్షాలతో చేతికందిన పంట వానపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వాన, శ్రీశైల మల్లన్న దగ్గర వీధులన్నీ జలమయమయ్యాయి. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..