Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Row: నీటి చుక్క కాదు నిప్పురవ్వ.. తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైర్..!

తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి.తెలంగాణలో, ఏపీలో గానీ ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కింద మేడిగడ్డ బ్యారేజ్‌, అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్ కట్టారు. ఏపీలో పోలవరం కడుతున్నారు. గోదావరి నీటిని గనక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారిలోనూ పంటలు పండిచొచ్చు.

Water Row: నీటి చుక్క కాదు నిప్పురవ్వ.. తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ ఫైర్..!
Dispute On Banakacharla Project
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 06, 2025 | 8:56 PM

బనకచర్ల ఒక గేమ్ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌.. అందులో నో డౌట్. గోదావరి నీటిని గనక సరిగ్గా ఉపయోగించుకుంటే సీమ ఎడారిలోనూ పంటలు పండిచొచ్చు. అందుకే.. తెలంగాణలో గానీ, ఏపీలో గానీ ప్రధాన ప్రాజెక్టులన్నీ గోదావరి మీదే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కింద మేడిగడ్డ బ్యారేజ్‌, అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్ కట్టారు. ఏపీలో పోలవరం కడుతున్నారు.

అసలు తెలుగు రాష్ట్రాలకు ఆధారమే గోదావరి. కృష్ణా నదిపై పైరాష్ట్రాల వాళ్లు బోలెడు ప్రాజెక్టులు కట్టుకున్నారు. పైన ప్రాజెక్టులు నిండిన తరువాతే.. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నీళ్లొస్తాయి. అందుకే, వర్షాకాలంలో గోదావరి వరద పోటెత్తి ప్రాజెక్టులు నిండుతాయి గానీ కృష్ణమ్మ పొంగడం చాలా తక్కువ. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా తక్కువే అనిపిస్తుంది ఆ వరద చూస్తే, ఏడాదికి కనీసం 3వేల నుంచి 4వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయి. 3వేల టీఎంసీల నీళ్లు సంద్రంలో కలపడం కంటే.. అందులో 10 శాతం వాడినా కరువు పోతుంది. ఆ ప్రయత్నమే బనకచర్ల.

ముందుగా గోదావరి నీటి ప్రవాహ తీరును చూద్దాం.

మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలంగాణలోని బాసర, మంథని, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తుంది. ఒక్కసారి భద్రాచలం దాటిన తరువాత.. ఇక ఆ నీరంతా పట్టిసీమ, రాజమండ్రి, అంతర్వేది మీదుగా సముద్రంలో కలుస్తుంది. అటు తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాదసాగర్, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్లు ఉన్నాయి. కాని, ఏపీలో గోదావరిపై ధవళేశ్వరం మాత్రమే ప్రధాన ప్రాజెక్ట్. ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో గోదావరి ప్రవాహ తీరు

కాని, ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టినా.. ప్రతి ఏడాది కనీసం 3వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 10 శాతం.. అంటే 300 టీఎంసీలు చాలు అంటోంది ఆంధ్రప్రదేశ్‌. పైగా.. ఇది నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌ కూడా. బనకచర్ల ప్రాజెక్ట్‌ అనేది గోదావరి-కృష్ణా నదులను కలుపుతుంది. అంతేకాదు.. బనకచర్ల నీళ్లు పెన్నా నదిలోకి కలుస్తాయి. దీంతో దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానానికి అతిపెద్ద పునాది పడినట్టే..!

ఇప్పటి వరకు పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతున్నారు. గోదావరికి వరద వచ్చే సమయంలో ఒక్కోసారి కృష్ణమ్మ ఖాళీ అవుతుంది. ఆ సమయంలో పట్టిసీమ నీటిని లిఫ్ట్‌ చేసి కృష్ణా పరివాహకంలోని పంటలకు సాగునీరు ఇస్తున్నారు. పోలవరం పూర్తయితే.. ఇక పట్టిసీమ అవసరం లేకుండానే గోదావరి నీటిని కృష్ణాలోకి మళ్లించొచ్చు. షార్ట్‌గా చెప్పాలంటే.. అదే బనకచర్ల ప్రాజెక్ట్

బనకచర్ల ప్రాజెక్ట్‌ మొదటి దశ

ప్రస్తుతం పోలవరం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కుడి కాలువ ద్వారా గోదావరి నీటిని వైకుంఠపురం బ్యారేజ్‌లోకి పంపుతారు. ఈ వైకుంఠపురం బ్యారేజ్‌ ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువన ఉంటుంది. అయితే.. పోలవరం నుంచి వైకుంఠపురానికి నీళ్లు తేవడానికి ప్రస్తుతం 17వేల 500 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కెనాల్ ఉంది. కాని, ఇది సరిపోదు. అందుకే, దీన్ని 38వేల క్యూసెక్కులకు పెంచుతున్నారు. దీంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల సామర్ధ్యాన్ని కూడా పెంచుతారు. ప్రస్తుతం తాడిపూడి ఎత్తిపోతల కెపాసిటీ 1,400 క్యూసెక్కులు. దీన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతారు. దీనికోసం.. కొత్తగా 25వేల క్యూసెక్కుల కెపాసిటీతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు. అటు పోలవరం కుడి కాలువ, దానికి సమాంతరంగా తవ్వుతున్న మరో కొత్త కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజ్‌కి నీళ్లు తీసుకెళ్తారు. అంటే.. గోదావరి ఎర్రనీరు.. కృష్ణాలోని నల్లనీళ్లకు సంగమం జరుగుతుంది.

ఇక రెండో దశ..

ఈ వైకుంఠపురం బ్యారేజ్‌ అనేది.. ఎగువన పులిచింతల, దిగువన ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఉంటుంది. వైకుంఠపురంలో నీళ్లని నిల్వ చేయడానికంటే ముందు.. మరో పని ఇక్కడే జరుగుతుంది. నాగార్జున సాగర్‌ కుడి కాలువ ఆల్రెడీ ఉంది. ఈ కుడి కాలువ ప్రవహిస్తున్న దారిలో సరిగ్గా 80వ కిలో మీటర్‌ దగ్గర ఆ కెనాల్‌ కెపాసిటీని పెంచుతారు. 96.5 కిలోమీటర్ల వరకు.. అంటే 16.5 కిలోమీటర్ల పొడవున.. నాగార్జున సాగర్‌ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతారు. నిజం చెప్పాలంటే.. అదే ఒక పెద్ద రిజర్వాయర్‌లా కనిపిస్తుంది. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. బొల్లాపల్లిలో ఏకంగా 150 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్‌ కట్టబోతున్నారు.

ఇక మూడో దశ..

బొల్లాపల్లిలో నీటిని స్టోర్‌ చేసి.. ఆ నీటిని బనకచర్ల రెగ్యులేటర్‌కు పంపిస్తారు. అయితే.. బొల్లాపల్లి, బనకచర్ల మధ్య నల్లమల అడవులు ఉన్నాయి. కొండ ప్రాంతం. అందుకే, ఏకంగా 23 కిలోమీటర్ల పొడవున సొరంగం తవ్వాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌ రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ ద్వారా వైకుంఠపురానికి, అక్కడి నుంచి లిఫ్ట్‌ల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం ఏకంగా 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఆల్‌మోస్ట్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సైజ్‌ ఇది. ఈ నీళ్లన్నీ ఎప్పుడు తరలిస్తారంటే.. కేవలం వర్షాకాలం ఉన్నప్పుడే. ఒక రకంగా ఇవి వృథా జలాలే. సముద్రంలో కలిసే నీటిలో ఓ 10 శాతాన్ని ఉపయోగించుకుంటున్నారు. బనకచర్ల ద్వారా కరువు ప్రాంతాలైన పల్నాడు, రాయలసీమ, వెలుగొండ, ప్రకాశం జిల్లాలకు నీరు అందుతాయి. కృష్ణా నదిలో తగినంత నీరు లేకపోయినా ఆ ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. అందుకే, దీన్ని గేమ్‌ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ అంటున్నారు సీఎం చంద్రబాబు.

తెలంగాణ అభ్యంతరం ఏంటి?

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన గోదావరి నీళ్లు 1,486 టీఎంసీలు. అంతకు మించి వాడుకునే హక్కులు ఎవరికీ లేవు. కాని, సముద్రంలో కలిసే నీళ్లు అంటూ 200 టీఎంసీలు తీసుకెళ్తోంది ఏపీ. రేప్పొద్దున గోదావరిలో నీళ్లు తగ్గినా.. కృష్ణాలో నీటిని ఈ లిఫ్టుల ద్వారా తరలిస్తారనేది తెలంగాణ భయం. ఏపీలో బనకచర్ల నిర్మిస్తామని చెప్పగానే తెలంగాణ అభ్యంతరం చెబుతోంది గానీ.. నిజానికి ఇది కొత్త ప్రాజెక్ట్‌ కాదు. వైఎస్ జగన్‌ ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. 2022లో ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని క్లెయిమ్ చేసుకుంటోంది వైసీపీ. బనకచర్లతో.. పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాలు తీరతాయని చెబుతోంది.

అందులోనూ ఒక రూల్‌..

నది ప్రవహిస్తున్న రాష్ట్రాల్లో చిట్టచివరి రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. సముద్రంలో కలిసిపోయే నీటిని చివరి రాష్ట్రం వాడుకోవచ్చు. ఈ ప్రత్యేక వెసులుబాటు ఎందుకంటే.. గోదావరి నదిపై మహారాష్ట్ర బోలెడు ప్రాజెక్టులు కట్టింది. ఇటు తెలంగాణలోనూ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులన్నీ నిండిన తరువాతనే ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వస్తాయి. అందుకే, ఆ ప్రత్యేక హక్కులు. చంద్రబాబు వాదన కూడా ఇదే. సముద్రంలోకి పంపే బదులు ఆ నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం.. అందులో తప్పేంటి అంటున్నారు.

కాని, తెలంగాణ ఊరుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్ నుంచి. ఇప్పుడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటే.. తెలంగాణ ఊరుకోకపోవచ్చు. మరి.. ఈ నీళ్ల జగడాన్ని ఎలా తీర్చుకుంటారో చూడాలి. ఎన్డీయేలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు మాట నెగ్గుతుందా..? బీజేపీకి తెలంగాణలో అధికారం ముఖ్యం కాబట్టి చంద్రబాబును ఆపుతారా అనేది చూడాలి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..